మరో మూడు రోజులు ఈడీ కస్టడీకి కవిత

మరో మూడు రోజులు ఈడీ కస్టడీకి కవిత
* హైదరాబాద్ లో ఈడీ సోదాలు
 
ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  ఈడీ కస్టడీని మరో మూడు రోజులపాటు కోర్టు పొడిగించింది.  ఆమె కస్టడీ కాలం పూర్తి కావడంతో శనివారం మధ్యాహ్నం ఆమెను ఈడీ  కోర్టులో ప్రవేశపెట్టింది. మరో ఐదు రోజులపాటు కస్డడీ గడువు పొడిగించాలని ఈడీ కోరగా,  రౌస్ అవెన్యూ కోర్ మరో మూడు రోజులు పొడిగించింది. 
 
ఫలితంగా మరో మూడు రోజులపాటు కవితను ఈడీ ప్రశ్నించనుంది. తిరిగి మార్చి 26వ తేదీన ఉదయం 11 గంటలకు కవితను కోర్టులో హాజరుపర్చనున్నారు. 
కోర్టులోకి వెళ్ల సమయంలో కవిత మాట్లాడుతూ గతంలో  అడిగిన వివరాలనే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని తెలిపారు. పూర్తిగా తప్పుడు కేసును బనాయించారని, కొత్తగా అడిగింది ఏం లేదని ఆమె చెప్పారు. తన అరెస్ట్ పై న్యాయపోరాటం చేస్తామనని చెప్పారు.

మరోవైపుశనివారం ఉదయం 06 గంటల తర్వాత ఏడు మందితో కూడిన ఈడీ అధికారుల బృందం హైదరాబాద్ లోని మాదాపూర్ లో సోదాలు చేపట్టింది. ఇక్కడ ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న కవిత ఆడపడుచు అఖిల నివాసంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలిసింది.కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ సోదాలు జరుగుతున్నాయా? లేక మరేదైనా కోణంలో తనిఖీలు చేపట్టారా? అన్నది తేలాల్సి ఉంది.

ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ  ఊరట దక్కలేదు. ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారించింది. ప్రస్తుత సమయంలో తాము బెయిల్ ఇవ్వలేమని, కింది కోర్టునే ఆశ్రయించాలని సూచించింది.

ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించిన కోర్టు ఈ పిటిషన్ పై త్వరితగతిన విచారణ జరపాలని కింది కోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేలా ఎం. త్రివేది కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వలను జారీ చేసింది. బెయిల్ అభ్యర్థనను విచారించే మొదటి న్యాయస్థానం ట్రయల్ కోర్ట్ అని నొక్కిచెప్పింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇక్కడ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తే  మళ్లీ సుప్రీంను కవిత ఆశ్రయించే అవకాశం ఉంది.

కవిత అరెస్ట్ కు తెలంగాణకు సంబంధం లేదు
 
కవిత అరెస్ట్‌కు, తెలంగాణ రాజకీయాలకు, బిజెపికి, తెలంగాణకు, తెలంగాణ సెంటిమెంట్‌కు ఏమాత్రం సంబంధం లేదని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంతో కలిసి చేసిన అవినీతికి సంబంధించి కవితను అరెస్ట్ చేశారని ఆయన గుర్తు చేశారు.
ఢిల్లీ మద్యం కేసులో కవిత పాత్ర ఉంటనే ఈడీ అరెస్ట్ చేసిందని, ఆమెను దృష్టిలో పెట్టుకొని మద్యం కేసు దర్యాఫ్తు జరగలేదని వివరణ ఇచ్చారు. అయితే,  సిఎం కెసిఆర్ తన కూతురు కవితను అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడలేదని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసినప్పుడు బ్లాక్ డే అంటున్నారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. దీని వెనుక మర్మం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.