ఉచితాలపై విచారణకు సీజేఐ ధర్మాసనం అంగీకారం

ఉచితాలపై విచారణకు సీజేఐ ధర్మాసనం అంగీకారం
ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఉచిత వాగ్దానాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం అంగీకరించింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రా ధర్మాసనం ఎదుట పిటిషనర్లలో ఒకరి తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా ఎదుట పిటిషన్‌పై ప్రస్తావించారు.
 
పిటిషన్లపై విచారణ జరిపి తీర్పును ఇవ్వాలని అవసరం ఉందని తెలిపారు. ఈ అంశంపై గురువారం విచారణ కొనసాగిస్తామని పేర్కొంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయని, ఈ క్రమంలో పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం ఉందని పిటిషనర్‌ అశ్విని ఉపాధ్యాయ్‌ తరఫున హాజరైన న్యాయవాది విజయ్‌ హన్సారియా వాదించారు.  ఈ వాదనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నది. 
 
ఎన్నికల్లో ఉచితాలు ఇస్తామన్న రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని, ఎన్నికల గుర్తులను జప్తు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్‌ కోరారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఏకపక్షంగా వాగ్దానాలు చేస్తున్నాయని పేర్కొంటూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రజాకర్షక చర్యలను పూర్తిగా నిషేధించాలని, ఈ విషయంలో ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించేలా చూడాలని పిటిషనర్‌ కోరారు. 
 
ఈ విధానం ఎన్నికల ప్రక్రియ, పవిత్రతను దెబ్బతీస్తుందని ఆరోపించారు. అయితే, గతంలో పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీలు ప్రజలకు హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని పేర్కొంది. ఉచితాల పేరుతో ప్రజాధనం వృథా కాకూడదని, అదే సమయంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందకూడదని తమ ఉద్దేశం కాదని అప్పటి సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనం పేర్కొంది. 
 
ఈ పిటిషన్‌లో పలు రాజకీయ పార్టీలు సైతం ఇంప్లీడ్‌ అయ్యాయి. ఈ క్రమంలో ఉచితంగా ఇస్తామ‌నే హామీల విష‌య‌లో స్పష్టత అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘ఫ్రీబీస్‌, సంక్షేమ పథకాలకు తేడా? ఉచితంగా ఎల‌క్ట్రానిక్ డివైజెస్‌ను ఇవ్వడం.. ఉచితంగా క‌న్సూమ‌ర్ గూడ్స్‌ను ఇవ్వడం సంక్షేమ కార్యక్రమంగా నిర్వచించ‌వ‌చ్చా? వీట‌న్నింటిపై స‌మ‌గ్ర అధ్యయ‌నం అవ‌స‌రం’ అని ధర్మాసనం పేర్కొంది. 
 
అయితే, ఈజీఎస్‌ లాంటి పథకంతో ప్రజలు గౌర‌వ‌నీయమైన జీవ‌నం గడిపేందుకు వీలైందని,  పలు పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం లేద‌ని ధర్మాసనం గుర్తు చేసింది.