ఎట్టకేలకు బీజేపీలో బీఆర్ఎస్ నేత అరూరి రమేశ్ 

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి చేసి బీజేపీలో చేరారు. శనివారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీలో చేరి వరంగల్ నుండి ఆ పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆయన గత పది హేను రోజులుగా  పార్టీ మారుతున్న విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
ఇప్పటికే రెండు సార్లు ఆయన బీజేపీలో చేరే కార్యక్రమం బీఆర్ఎస్ నేతల బుజ్జగింపుల వల్ల వాయిదా పడింది. కానీ ఆయన మాత్రం ఓ వైపు బీఆర్ఎస్ నేతలతో రాజీపడుతూనే, మరోవైపు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. వాస్తవానికి 2014, 2018 ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో గెలుపొందిన ఆయన ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ఆరాట పడ్డారు. కానీ వ్యక్తిగతంగా ఆయన క్యాడర్ పై ఉన్న వ్యతిరేకతతో పాటు పార్టీపై పెరిగిన ప్రతికూలత వల్ల ఆయన ఓటమి పాలయ్యారు.
 
ఆ తరువాత అరూరి రమేశ్ ఎంపీ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడంతో పాటు కిందిస్థాయి నేతలపై పెరిగిన వ్యతిరేకత వల్ల ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతోనే ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు అడుగులు వేశారు. బీఆర్ఎస్ టికెట్ ఇస్తానని పార్టీ అధిష్ఠానం మాటిచ్చినా దానిని వదులుకుని బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 
 
ఈ మేరకు ఈ నెల మొదటి వారంలో తెలంగాణకు వచ్చిన ప్రధానమంత్రి  మోదీ సమక్షంలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. కానీ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలగజేసుకుని సర్దిచెప్పడంతో పార్టీ మారే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. 
 
ఆ తరువాత నాలుగైదు రోజుల కిందట కూడా మళ్లీ కమలం పార్టీలో చేరేందుకు సిద్ధం కాగా మాజీ మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అరూరి రమేశ్ ను హైజాక్ చేసి, హైదరాబాద్ తీసుకెళ్లారు. దీంతో అప్పటి నుంచి అరూరి రమేశ్ పయనమెటు అనే విషయంపై తీవ్ర చర్చ జరిగింది.