సెప్టెంబర్ 17న అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం

సెప్టెంబర్ 17న అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం

* నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

భారతదేశంలో హైదరాబాద్ రాజ్యాన్ని విలీనం చేసిన సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. గత కొన్నేళ్లుగా సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది.

”భారత్‌ స్వాతంత్య్రం పొందాక హైదరాబాద్‌ సంస్థానం 13 నెలల పాటు నిజాంల పరిపాలనలోనే ఉంది. 1948 సెప్టెంబర్‌ 17న పోలీస్‌ చర్య ‘ఆపరేషన్‌ పోలో’తో ఈ ప్రాంతం భారత్‌లో విలీనమైంది. సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ విమోచన దినం’ నిర్వహించాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి నింపడానికి సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ విమోచన దినం’ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది” అని హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

సెప్టెంబర్‌ 17న సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. నిజాం పాలనలో రజాకార్ల ఆగడాలపై పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు కూడా ఉద్యమించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా సంస్థానాలు సొంత రాజ్యాలుగా ఉండిపోయాయి. వల్లభ్‌ భాయ్ పటేల్ నిర్ణయంతో కఠిన చర్యలతో స్వతంత్ర రాజ్యాలన్నీ భారతదేశంలో భాగంగా మారాయి.

దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ విషయంలో మాత్రం తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. 1948 సెప్టెంబర్ హైదరాబాద్ సంస్థానం లొంగిపోయిన నేపథ్యంలో జరిగిన రాజకీయ, సైనిక పరిణామాలపై భిన్న వాదనలు ఉన్నాయి. సెప్టెంబర్ 17 విలీన దినోత్సవం, విమోచన దినం, విముక్తి దినం, విద్రోహ దినంగా రకరకాల రాజకీయ వాదనలు ఉన్నాయి.

సెప్టెంబర్‌ 17 విషయంలో మతపరమైన భావోద్వేగాలతో ముడిపడి ఉండటంతో దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపడానికి అధికారంలో ఉన్న పార్టీలు వెనుకంజ వేశాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై ఏటా సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ విముక్తి దినం’ నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెప్టెంబర్‌ 17న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని గెజిట్‌లో పేర్కొంది.

17 సెప్టెంబర్ ను  హైదరాబాద్ విమోచన దినంగా నిర్వహించాలని కేంద్ర హోంశాఖా గజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం పట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు హర్షం ప్రకటించారు.  విమోచన ఉత్సవాలు ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో భాగాలుగా ఉన్న ప్రాంతాలలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుండగా  అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించక పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.