ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు మరోసారి గడువు పెంపు

ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోడానికి కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియనుండడంతో మరో మూడు నెలలు గడువు పొడిగిస్తూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఎఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉడాయ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.  దీంతో జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చు. మొదట 2023 మార్చి 15 వరకు ఉన్న గడువును డిసెంబర్ 14 వరకు పొడిగించింది. తరువాత 2024 మార్చి 14 వరకు అప్‌డేట్ చేసుకోడానికి అవకాశం కల్పించింది.

తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగించింది. ఆధార్ అప్‌డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉడాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఉడాయ్ వెబ్‌సైట్ లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫోటో పాస్‌బుక్, పాస్‌పోర్టు వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు.

టీసీ, మార్క్‌షీట్, పాన్/ ఇప్యాన్ , డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఉపయోగపడతాయని తెలిపింది. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వినియోగించుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. ఉచిత సేవలు ‘ మై ఆధార్ పోర్టల్ ’ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలియజేసింది.

ఆధార్‌ ప్రారంభించిన తొలినాళ్లలో తీసుకున్న వారి కార్డుల వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఫొటోలు, చిరునామాల మార్పు, తప్పొప్పులతో తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో, వారు అనేక ఇక్కట్లకు గురికావాల్సి వస్తున్నది. 

దీనిపై విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థకు కూడా పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆధార్‌ కార్డుల సవరణతోపాటు అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించింది. 2014 కంటే ముందు ఆధార్‌ పొందిన వారు తమ వివరాలను అప్డేట్‌ చేసుకోవాలని సూచిస్తూ, ఉత్తర్వులు విడుదల చేసింది. కార్డు నవీకరణ చేసుకునేందుకు జూన్‌14 వరకు గడువు కూడా విధించింది. 

చిన్నారులకు కార్డు తీసుకుని ఐదేండ్లు దాటితే వేలిముద్రలు, ఫొటోలను కూడా అప్డేట్‌ చేసుకునే అవకాశం కల్పించింది. పదేళ్ల కింద ఆధార్‌ కార్డు పొందిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ఉపాధికార సంస్థ(యూఐడీఏఐ) సూచిస్తున్నది.