ఏపీలో 35 జాతీయ రహదారుల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

ఏపీలో 35 జాతీయ రహదారుల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన 35 జాతీయ రమదారుల్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా ఎన్ హెచ్ ఏ ఐ ద్వారా రాష్ట్రంలో రూ.29,395 కోట్లతో 1,134 కి.మీ. పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టింది. 

రూ.లక్ష కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 114 జాతీయ రహదారి ప్రాజెక్టులను కేంద్రం చేపట్టింది. మొత్తం ప్రాజెక్టుల్లో 30 శాతం ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. విజయవాడ ఈస్ట్ బైపాస్, భోగాపురం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో రూ.29,395 కోట్ల వ్యయంతో చేపట్టిన 35 ప్రాజెక్టులకు సంబంధించిన 1,134 కి.మీ పొడవైన జాతీయ రహదారులను హరియాణాలోని గుర్ గ్రామ్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.

సోమవారం విజయవాడలో జాతీయ రోడ్డు, రవాణా మరియు జాతీయ రహదారి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్వారకా ఎక్స్ ప్రెస్ హైవేలోని హరియాణా సెక్షన్ (ఢిల్లీ -గుర్ గ్రామ్) సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు సంబంధించి లక్ష కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

 పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా వర్చువల్ గా చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రాజెక్టులతో పాటు విజయవాడ ఈస్ట్ బైపాస్, వైజాగ్ సమీపంలోని భోగాపురం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ సెక్రటరీ ప్రద్యుమ్మ విజ్ఞప్తి చేశారు.

ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల్లో ప్రధానంగా రూ. 14,060 కోట్లతో 344 కి.మీల పొడవైన 6 లైన్ల(ఎన్ హెచ్- 544జి) బెంగుళూరు -కడప – విజయవాడ ఎకనమిక్ కారిడార్ తో పాటు పలు ప్రాజెక్టులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో 30 శాతం ప్రాజెక్టులను ఏపీకి కేటాయించామని ప్రధాని మోదీ తెలిపారు. దాదాపు 30 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారులను నిర్మిస్తున్నామన్నారు. కొన్ని జాతీయ రహదారులు ఇప్పటికే పూర్తయిన విషయాన్ని గుర్తు చేశారు.