ఆస్కార్‌ వేదికపై మరోసారి ఆర్‌ఆర్‌ఆర్‌ దృశ్యాలు

టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. స్టార్‌ నటులు జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌  ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఎన్నో రికార్డులను తిరగరాసింది. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

ఈ చిత్రం నుంచి గత ఏడాది జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డుల వేడుకల్లో ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ వరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్కార్‌ వేడుకల్లో మరోసారి ఈ పాట మెరిసింది. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది.

ఈ వేడుకల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దృశ్యాలు కనిపించాయి. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటరిగీలో అవార్డును ప్రకటించే సమయంలో తెరపై ‘నాటు నాటు’ పాటను ప్రదర్శించారు. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ వేసిన ‘నాటు నాటు’ హుక్ స్టెప్ విజువ‌ల్స్ క‌నిపించాయి. సాధార‌ణంగా ఏ అవార్డు ఇచ్చినా, నామినీల వివ‌రాల‌తో పాటుగా, గ‌తేడాది ఆ కేట‌గిరిలో అవార్డు పొందిన సినిమా తాలుకూ విజువ‌ల్స్ ప్లే చేయ‌డం ప‌రిపాటి. 

అలా ‘నాటు నాటు’ పాట‌ని మ‌రోసారి ఆస్కార్ వేదిక‌పై చూసుకొనే అవకాశం తెలుగు సినీ ప్రియులకు దక్కినట్లైంది. అంతేకాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని కొన్ని దృశ్యాలను కూడా ఈ వేదికపై తళుక్కున మెరిశాయి. ఇప్పటి వరకూ సినిమాల్లో వచ్చిన బెస్ట్‌ స్టంట్స్‌కు సంబంధించిన సీన్స్‌ను ఓ ప్రత్యేక వీడియో ద్వారా ఈ వేదికపై ప్రదర్శించారు. 

అందులోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని రెండు యాక్షన్‌ షాట్స్‌ ఇందులో కనిపించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌ అవుతోంది.