సీట్ల సర్దుబాట్లపై చంద్రబాబు ఇంట్లో బీజేపీ నేతల మంతనాలు

సీట్ల సర్దుబాట్లపై చంద్రబాబు  ఇంట్లో బీజేపీ నేతల మంతనాలు
వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీచేయనున్నట్లు ప్రకటించిన టీడీపీ, బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటు మీద కూడా ఇప్పటికే ఓ అవగాహన వచ్చినట్లు తెలిసింది. అయితే ఎవరెవరు ఎక్కడ పోటీచేయాలనే దానిపై మూడు పార్టీలు తొలిసారిగా ఉమ్మడిగా సమావేశం అయ్యాయి. 
 
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో మూడు పార్టీల నేతల మధ్య సోమవారం కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ నుంచి కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, బీజేపీ  ఉపాధ్యక్షుడు బైజయంత్ పండా, జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ హాజరయ్యారు. 
 
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా భేటీలో ఉన్నారు. బీజేపీ, జనసేన పార్టీలు రాష్ట్రంలోని 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడం ఖరారైన నేపథ్యంలో ఏయే పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేదానిపై నేతలు చర్చిస్తున్నారు. జనసేన ఇప్పటికే 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేసింది.
 
సీట్ల సంఖ్యపై వచ్చినప్పటికీ ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపైనా ప్రధానంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ 94, జనసేన ఆరు చోట్ల అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా బీజేపీ వచ్చి చేరటంతో ఆ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందనేదీ ఆసక్తికరంగా మారింది. పొత్తులో భాగంగా ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చేయాల్సి వస్తుందా దానిపై కీలక నేతలు చర్చిస్తున్నారు. 
 
సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ కూటమి తరుఫున అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో మూడు పార్టీలు ఆలోచనలు చేస్తున్నాయి. అయితే వైసీపీ నుంచి మైనారిటీలు బరిలో ఉన్న స్థానాలలో తాము పోటీ చేస్తామని బీజేపీ చెప్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కదిరి, పి. గన్నవరం, శ్రీకాళహస్తి, మదనపల్లె స్థానాలు కీలకంగా మారాయి.
 
ఆదివారం నోవాటెల్‌లో జరిగిన భేటీలో గజేంద్రసింగ్ షెకావత్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధేశ్వరి తన అభిప్రాయాలను, ప్రతిపాదనలను వివరించారు. సీట్ల సర్దుబాటు విషయంలో పార్టీ అధిష్టానందే తుది నిర్ణయం అని ఆమె స్పష్టం చేశారు. మరోవంక, పవన్ కళ్యాణ్ తో కూడా ఆదివారం కేంద్ర మంత్రి విడిగా సమాలోచనలు జరిపారు.