బ్యాంక్ ఉద్యోగులకు17 శాతం వేతనం పెంపు, శనివారం సెలవు

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య పలు చర్చోపచర్చల అనంతరం ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో పలు కీలక అంశాలపై రెండు వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అందులో కీలకమైనది పీఎస్యూ బ్యాంక్ ఉద్యోగుల వేతనాన్ని ప్రతీ సంవత్సరం 17 శాతం పెంచాలన్న ప్రతిపాదన. అంతేకాకుండా, ప్రభుత్వ నోటిఫికేషన్ కు లోబడి అన్ని శనివారాలను సెలవు దినాలుగా గుర్తించేందుకు ఒప్పందం కుదిరింది.

నవంబర్ 1, 2022 నుంచి అమల్లోకి రానున్న బ్యాంకు అధికారులు, ఉద్యోగులకు వేతన సవరణకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో యు ఎఫ్ బి యు, ఏఐబీఓఏ, ఏఐబీఏఎస్ఏం, బికెఎస్ఏం ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చల అనంతరం 9వ జాయింట్ నోట్ పై సంతకాలు చేశారని, ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా ట్వీట్ చేశారు.

ఈ నిర్ణయంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు సుమారు రూ.8,284 కోట్ల అదనపు భారం పడనుంది. 2022 నవంబర్ నుంచి అమల్లోకి వచ్చే ఈ వేతన పెంపుతో సుమారు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత, శనివారం కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ, పనివేళలు అమల్లోకి వస్తాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలిపింది.

1. పీఎస్ యూ బ్యాంక్ ఉద్యోగులకు 17 శాతం వేతనాలు పెరగనున్నాయి. ఈ ఇంక్రిమెంట్ 2022 నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, సీఏఐఐబీ (సీఏఐఐబీ పార్ట్-2) పూర్తి చేసిన అధికారులకు రెండు అదనపు ఇంక్రిమెంట్లు లభిస్తాయని తెలిపింది.

2. ఐబీఏ, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఒప్పందం తర్వాత పీఎస్యూ బ్యాంక్ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ లో 8088 పాయింట్లకు సంబంధించిన డియర్నెస్ అలవెన్స్ విలీనం ఉంటుంది.

3. సవరించిన వేతన ఒప్పందం ప్రకారం, మహిళా ఉద్యోగులు మెడికల్ సర్టిఫికేట్ లేకుండా నెలకు ఒక అనారోగ్య సెలవుకు అర్హులు అవుతారు.

4. పదవీ విరమణ తర్వాత లేదా సర్వీసులో ఉండగా మరణిస్తే, 255 రోజుల వరకు ప్రివిలేజ్ లీవ్ ను ఎన్క్యాష్ చేసుకోవచ్చు.

5. ఎస్బీఐ సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ తో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు నెలవారీ ఎక్స్ గ్రేషియా మొత్తం లభిస్తుంది. అక్టోబర్ 31, 2022 లేదా అంతకంటే ముందు పెన్షన్ పొందడానికి అర్హులైన పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు ఇది వర్తిస్తుంది, ఆ తేదీలో పదవీ విరమణ చేసిన వారితో సహా.