రామ మందిరం వెబ్‌సైట్లపై చైనా, పాక్‌ హ్యాకర్ల యత్నం!

రామ మందిరం వెబ్‌సైట్లపై చైనా, పాక్‌ హ్యాకర్ల యత్నం!

ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామ మందిరం రూపుదిద్దుకున్నది. ఈ ఏడాది జనవరి 22న ఆలయంలో బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేత్రపర్వంగా సాగింది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం దేశ విదేశాల నుంచి బాల రాముడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. 

ఈ క్రమంలో ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థ్యం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసేందుకు పాక్‌తో పాటు చైనా హ్యాకర్లు ప్రయత్నించారు. ఓ నివేదిక ప్రకారం  జనవరి రామ మందిరం ప్రారంభోత్సవం సమయంలో చైనా, పాక్‌కు చెందిన హ్యాకర్లతో పాటు సైబర్‌ నేరగాళ్లు సైతం భారతీయ వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకున్నారు. 

రామమందిరం, ప్రసార భారతితో పాటు ఇతర ప్రభుత్వ వెబ్‌సైట్‌లపై హ్యాకర్స్‌ నిరంతరం దాడికి పాల్పడుతున్నట్లుగా తెలుస్తున్నది.  రామాయలంతో పాటు ఇతర ప్రభుత్వ వెబ్‌సైట్స్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ముందే అంచనా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. టెలీకాం సెక్యూరిటీ ఆపరేషన్‌ సెంటర్‌ ((టిఎస్ఓసి) దాదాపు 264 వెబ్‌సైట్‌లను పర్యవేక్షిస్తున్నది. 

ఇందులో ప్రసార భారతి, ఎయిర్‌పోర్ట్‌లు, యూపీ టూరిజం, రామమందిరం, పవర్‌ గ్రిడ్‌ తదితర వెబ్‌సైట్లు ఈ జాబితాలో ఉన్నది. రామమందిరం వంటి సైట్లపై దాడి చేసిన దాదాపు 140 ఐపీ అడ్రస్‌లను గుర్తించి, వాటిని బ్లాక్ చేయాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది. 

ఈ ప్రయత్నాలన్నీ జనవరి 21న జరగ్గా,  హ్యాక్ చేసేందుకు యత్నిస్తున్న దాదాపు 1,244 ఐపీ అడ్రస్‌లను బ్లాక్‌ అయ్యాయి. ఇంతకుముందు జీ20 సమ్మిట్ సందర్భంగా ఇలాంటి ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హ్యాకింగ్‌ను నిరోధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగిస్తున్నది.