విపక్షాలు వెళ్లిపోకుండా తాళం వేయమని పంజాబ్ సీఎం

విపక్షాలు వెళ్లిపోకుండా తాళం వేయమని పంజాబ్ సీఎం

పంజాబ్‌ అసెంబ్లీలో సోమవారం అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు వాకౌట్‌ చేయటానికి వీల్లేకుండా సభకు తాళం వేయాలని కోరుతూ తాళంతోపాటు తాళం చెవి ఉన్న కవర్‌ను స్పీకర్‌కు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అందచేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం రేగింది.

పంజాబ్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ సెషన్‌ రెండో రోజైన మార్చి 1న గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పంజాబ్‌ సీఎం మాన్‌ నిందించారు. దీనిపై చర్చకు సభలో డిమాండ్‌ చేశారు. ఆప్‌ ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సెషన్‌ ప్రారంభంలో క్వశ్చన్‌ అవర్‌, జీరో అవర్‌ చేపట్టే పద్ధతికి విరుద్దంగా గవర్నర్‌ ప్రసంగానికి అంతరాయం కలిగించిన అంశంపై చర్చకు స్పీకర్‌ కుల్తార్‌ సింగ్‌ సంధ్వన్‌ అనుమతించారు.

చర్చ ప్రారంభించే ముందు సీఎం మాన్‌ స్పీకర్‌ చేతికి తాళం, దాని చెవి ఉన్న కవర్‌ ఇచ్చారు. చర్చ సమయంలో ప్రతిపక్ష సభ్యుల సభను వీడి బయటకు వెళ్లకుండా సభ తలుపులు వేసి తాళం వేయాలని కోరారు. తాను నిజాలు మాట్లాడుతానని, దీన్ని ప్రతిపక్షాలు సహించవని, వారు పారిపోకుండా ఉండేందుకు తాళం వేయాల్సిందిగా స్పీకర్‌కు సూచించారు. 

అయితే తామేమీ సభ వదిలివెళ్లమని కాంగ్రెస్‌ సభ్యుడు పర్తాప్‌ సింగ్‌ బజ్వా సీఎం మాన్‌తో చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. బజ్వా, మాన్‌లు వాదనకు దిగటంతో సభలో చర్చ జరిగేలా సభ తలుపులకు తాళం వేయటం లాంఛనమని స్పీకర్‌ తెలిపారు. ఓ దశలో పరిస్థితి అదుపు తప్పటంతో స్పీకర్‌ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. 

సభ వాయిదా పడ్డాక కూడా బజ్వా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికార ఆప్‌ సభ్యులు ప్రతిపక్షాల బెంచ్‌ల వైపు దూసుకెళ్లి వాదనకు దిగారు. ఇరు పార్టీలకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు పరిస్థితిని సద్దుమణిగించటానికి ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్‌, ఆప్‌ సభ్యుల మధ్య వాగ్వాదం కొనసాగింది.  మార్చి 1న బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుకున్నారు. రైతుల ఆందోళలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. గట్టిగా నినాదాలు చేశారు. దీంతో గవర్నర్‌ తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపేశారు.