వారంలో ఏపీలో పొత్తులపై బిజెపి స్పష్టత

ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపితో పొత్తు పెట్టుకొనే విషయమై వారం రోజులలో బిజెపి స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అమరావతిలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతల సమావేశాలు ముగిశాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలతో ఈ సమావేశాలు నిర్వహించారు.
 
శివప్రకాష్ వరుసగా 125 మందికి పైగా నేతలను కలిశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ పటిష్టతపై సమీక్ష నిర్వహించారు. ఏయే నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్నింటికీ మించి పొత్తులపై ఈ సమావేశాల్లో చర్చ జరిగింది. పొత్తులపై తమ అభిప్రాయాలను రాష్ట్ర నేతలు శివప్రకాష్ కు వివరించారు. 
 
పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేతలకు చెప్పారు. ఈ రెండు రోజుల సమావేశాల వివరాలను బీజేపీ నాయకత్వానికి శివప్రకాష్ నివేదించనున్నారు. ఏపీలో ఎన్నికల పొత్తులపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ సందర్భంగా  స్పష్టం చేశారు. శివ ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితి పై 26 జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు తో చర్చించినట్టు పురందేశ్వరి చెప్పారు.

రాష్ట్రంలో 50 వేలమంది అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నామని, సామాన్య ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటామని ఆమె చెప్పారు. 175 అసెంబ్లీ, 25 ఎంపి సీట్ల లో అభ్యర్థుల పోటీ పై ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు చెప్పారు. ప్రజల అభిప్రాయాలను జాతీయ నాయకత్వానికి వివరిస్తామని, అధిష్టానం నిర్ణయం బట్టి మా అడుగులు ఉంటాయని ఆమె వివరించారు.

బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు 2000 మంది వచ్చారని, ఒక్కో నియోజకవర్గంలో మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులు ఉన్నారని, పార్లమెంటరీ కమిటీ సమీక్ష చేసి అభ్యర్థులను ఖరారు చేస్తారని చెప్పారు.

ఏపీలో ఎన్నికల పొత్తు ఉంటే కేంద్ర పార్టీ పెద్దలే ప్రకటిస్తారని, ఏదేమైనా 175 అసెంబ్లీ, 25 ఎంపి స్థానాల్లో పోటీకి అభ్యర్థులు జాబితా సిద్దం చేశామని పురందేశ్వరి వెల్లడించారు. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గట్టి పోటీ ఇవ్వగలరనే  దాని పైనే చర్చ సాగిందని, జాబితా కేంద్రానికి రెండు రోజుల్లో పంపుతామని ఆమెచెప్పా రు. జాతీయ నాయకత్వం నిర్ణయం బట్టి కార్యాచరణ ఉంటుందని తెలిపారు.