తాకట్టులో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం!

మూడు రాజధానులు అంటూ గందరగోళం సృష్టించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చివరికి ఉన్న రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేసింది. అడ్డగోలుగా తెస్తున్న అప్పులు చాలక రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల కోసం వాడుకున్నారు. 

 ప్రస్తుత సచివాలయంలోని మొత్తం ఐదు బ్లాకులు తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. అప్పు కోసం తొలుత ఐసీఐసీఐ బ్యాంకును ఆశ్రయించగా ‘కుదరదు’ అని తేల్చడంతో, హెచ్‌డీఎ్‌ఫసీకి వెళ్లారు. ‘ఊరికే కాగితాలు చూపిస్తే సరిపోదు. సచివాలయ భవనాలను గుట్టుచప్పుడు కాకుండా హెచ్‌డీఎ్‌ఫసీకి తాకట్టు రిజిస్ట్రేషన్‌ చేసిచ్చేశారు.

జగన్‌ అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించిన సంగతి తెలిసిందే. చివరికి 90 శాతం పూర్తయిన అఖిలభారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల భవన సముదాయాలను కూడా గాలికి వదిలేశారు. కానీ ఇటీవల ఆ భవనాల్లో అధికారాలు నివసిస్తున్నారని, సీఆర్డీయేకు రూ.70 కోట్లు అద్దె కూడా చెల్లించామంటూ జీవో విడుదల చేశారు. 

ఈ భవనాలను కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చేందుకే ‘అద్దె’ నాటకం ఆడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించి, అక్కడి భూములు, నిర్మాణాలతో అప్పులు తెచ్చుకునే పనిలో  పడినట్లు కనిపిస్తుంది. దొండపాడు, పిచ్చుకలపాలెం వద్ద భూములను ఎకరం రూ.4 కోట్ల చొప్పున విక్రయించాలని ప్రయత్నించారు. 

కానీ, అప్పటికే మూడు రాజధానుల వ్యవహారం బయటికి రావడంతో, స్థిరమైన విధానాలు లేని జగన్‌ సర్కారును ఎవరూ నమ్మలేదు. తర్వాత రాజధాని రైతులు కోర్టును ఆశ్రయించి భూముల విక్రయాన్ని అడ్డుకున్నారు. ఈ ప్రభుత్వం  వైజాగ్‌లో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, భూములు, కాలేజీలు తాకట్టు పెట్టి ఏపీఎస్డీసీ ద్వారా రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చుకోవడం గమనార్హం. రోడ్లు, భవనాల శాఖ ఆస్తులు తాకట్టు పెట్టి రూ.7000 కోట్లు తెచ్చుకున్నారు.