మంగళూరు, బెంగళూరు పేలుళ్ల మధ్య లింక్

మంగళూరు, బెంగళూరు పేలుళ్ల మధ్య లింక్

బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు, 2022లో మంగళూరులో సంభవించిన కుక్కర్ పేలుడుకు మధ్య లింక్ ఉన్నట్లు కనిపిస్తోందని, పోలీసులు అన్ని కోణాల్లో నుంచి దర్యాప్తు చేస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తునకు ప్రభుత్వం నిబద్ధమై ఉందని, తూర్పు బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని ఈటరీలోని సంఘటనలపై దర్యాప్తు కోసం పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చామని ఆయన తెలిపారు. 

శుక్రవారం బెంగళూరు సంఘటనలో పది మంది గాయపడ్డారు. ‘పోలీస్ అధికారుల అభిప్రాయం ప్రకారం, మంగళూరు సంఘటనకు, ఈ సంఘటనకు మధ్య సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. పేలుళ్ల కోసం ఉపయోగించిన పదార్థాలలో పోలిక ఉంది. లింక్, టైమర్, ఇతర విషయాల మధ్య లింక్ చూడవచ్చు’ అని శివకుమార్ చెప్పారు.

మంగళూరు, శివమొగ్గ నుంచి పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చారని, అన్ని కోణాలను పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. ‘బెంగళూరు వాసులకు భయపడవలసిన అగత్యం లేదు. ఇది తక్కువ స్థాయి పేలుడు. దీనిని స్థానికంగానే తయారు చేశారు. కానీ శబ్దం హెచ్చుగా ఉంది’ అంటూ భరోసా ఇచ్చారు. 

`దుండగీడు టోపీ పెట్టుకున్నా, కళ్లజోడు ధరించినా అతని ముఖం అన్ని కోణాల నుంచి కనిపిస్తోంది. మూడు నాలుగు కోణాల నుంచి అతనిని చూడవచ్చు. అతని నడకను కూడా కెమెరాలు రికార్డు చేశాయి’ అని బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కూడా అయిన శివకుమార్ చెప్పారు.

ఆ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్లు కూడా సైట్ వ‌ద్ద డేటా సేక‌రిస్తున్నారు. అయితే అనుమానిత వ్య‌క్తి బాంబు బ్యాగ్‌తో వ‌చ్చి.. పేలుడు ఘ‌ట‌న జ‌రిగే వ‌ర‌కు మొత్తం 86 నిమిషాల స‌మ‌యం ప‌ట్టిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. ఉద‌యం 11:30 గంటల‌కు ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి బ‌స్సు దిగి కేఫ్‌కు వెళ్లాడు. 

సీసీటీవీ ఫూటేజ్ ద్వారా అనుమానితుడిగా భావిస్తున్న ఆ వ్య‌క్తి 11:38 గంటల‌కు ఇడ్లీ కోసం ఆర్డ‌ర్ ఇచ్చాడు. ఇక 11:44 గంటలకు ఆ అనుమానిత వ్య‌క్తి హ్యాండ్ వాష్ ఏరియాకు చేరుకున్నాడు. త‌న చేతుల్లో ఉన్న ఓ బ్యాగ్‌ను ఆ వాష్ ఏరియా వ‌ద్ద పెట్టాడు. ఆ బ్యాగ్‌లోనే పేలుడు ప‌దార్ధం ఉన్న‌ట్లు భావిస్తున్నారు.

ఆ కేఫ్ నుంచి అనుమానిత వ్య‌క్తి 11:45 గంటల‌కు బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. ఫూట్‌పాత్‌కు బ‌దులుగా అత‌ను రోడ్డుపై న‌డుస్తూ వెళ్లాడు. వాకింగ్ పాత్‌పై పెట్టిన సీసీటీవీ కెమెరాల‌ను త‌ప్పించుకోవాల‌న్న ఉద్దేశంతో అత‌ను రోడ్డు మీద న‌డిచిన‌ట్లు అనుమానిస్తున్నారు. ఇక మ‌ధ్యాహ్నం 12.56 గంటల‌కు రామేశ్వ‌రం కేఫ్‌లో బ్లాస్ట్ జ‌రిగింది. 

దీంతో అక్క‌డ గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. క‌స్ట‌మ‌ర్లు, సిబ్బంది ఉరుకులు ప‌రుగులు పెట్టారు. అయితే కేఫ్‌కు వంద మీట‌ర్ల దూరం త‌ర్వాత అనుమానిత వ్య‌క్తి అదృశ్య‌మైన‌ట్లు తెలుస్తోంది. కేఫ్‌లో బ్యాగ్ పెట్టి వెళ్లిన వ్య‌క్తి ఫోన్‌లో మాట్లాడిన్లు గుర్తించారు. అయితే అత‌ను ఎవ‌రికి కాల్ చేశాడ‌న్న కోణంలో విచార‌ణ జ‌రుగుతున్న‌ది.