కలకలం రేపిన బెంగుళూరులోని రామేశ్వ‌రం కేఫ్‌లో పేలుడు

* ఓ మహిళా బ్యాగ్ నుంచే పేలుడు?

బెంగళూరు నడిబొడ్డున ఉన్న ప్రఖ్యాతి చెందిన రామేశ్వ‌రం కేఫ్‌లో లో జరిగిన పేలుడు భారత ఐటీ రాజధానిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ పేలుడులో తొమ్మిది మంది గాయపడ్డారు. గ్రీన్ అవెన్యూ రోడ్‌లో ఉన్న వైట్‌ఫీల్డ్ బ్రాంచ్ కేఫ్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  పేలుడుకు తక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్థం కారణమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ధృవీకరించారు.

ఈ పేలుడు పదార్ధాన్ని ఓ కస్టమర్ బ్యాగులో ఉంచి, ఆ కెఫేలో పెట్టి వెళ్లినట్లు సిద్దరామయ్య తెలిపారు. మైసూరులో సిద్ధరామయ్య  విలేకరులతో మాట్లాడుతూ మధ్యాహ్నం తర్వాత రామేశ్వరం కెఫే లో ఎవరో బ్యాగ్ ఉంచారని, అది పేలి కొందరికి గాయాలయ్యాయని చెప్పారు.

 ‘‘సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. అది బాంబు పేలుడే. ఎవరు చేశారో తెలియదు. పరిస్థితిని సమీక్షించాలని హోంమంత్రిని ఆదేశించాను” అని సిద్ధరామయ్య తెలిపారు. ఇది స్వల్ప తీవ్రత కలిగిన పేలుడు అని ముఖ్యమంత్రి చెప్పారు. కర్ణాటకలో చివరి పేలుడు బీజేపీ ప్రభుత్వ హయాంలో మంగళూరులో జరిగిందని చెబుతూ దీనిపై రాజకీయాలు చేయవద్దని కోరారు.

ఈ పేలుడు ఘటనపై బెంగళూరు పోలీసులు కఠిన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తొలుత ఈ ప్రమాదానికి ఎల్‌పిగ్లీకేజి కారణమని భావించినప్పటికీ ఆ అవకాశం లేదని అగ్నిమాపక శాఖ తోసిపుచ్చింది. ఘటనా స్థలంలో ఒక మహిళకు చెందిన హ్యాండ్‌బ్యాగ్ లభించిందని, పేలుడుకు అసలు కారణాన్ని నిర్ధారించే ప్రయత్నంలో ఫోరెన్సిక్ బృందాలు ఉన్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. 

పేలుడులో గాయపడిన వారిలో ఇద్దరు సిబ్బంది, ఏడుగురు కస్టమర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిని నగరంలోని వివిధ ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందచేస్తున్నారు.  కేఫ్‌లో మహిళ తెచ్చిన బ్యాడులోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేఫ్ లోపల, వెలుపల అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు సిసి టివి ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

ప్రస్తుతం పోలీసుల దిగ్బంధంలో ఉన్న కేఫ్‌ను కర్నాటక డిజిపి అలోక్ మోహన్, బెంటళూరు పోలీసు కమిషనర్ బి దయానంద పరిశీలించారు. ఎన్‌ఐఎ, ఐబి అధికారులకు సమాచారం అందచేసినట్లు డిజిపి తెలిపారు. 

మధ్యాహ్నం 1.08 గంలకు కేఫ్‌లో ఎల్‌పిజి లీకేజి జరిగినట్లు తమకు ఫోన్ కాల్ వచ్చిందని కర్ణాటక రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సర్వీసుల శాఖ డైరెక్టర్ టిఎన్ శివశంకర్ తెలిపారు. అక్కడకు చేరుకున్న తమ అధికారులు, బృందాలకు మంటలు కనిపించలేదని ఆయన చెప్పారు. కేఫ్‌లో మరో ఆరుగరితో కలసి కూర్చుని ఉన్న ఒక మహిళ వెనుక పెట్టిన బ్యాగులో పేలుడు జరిగిందని ఆయన చెప్పారు. 

ఆ బ్యాగులో ఉన్న పదార్థం వల్లే పేలుడు సంభవించి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ బ్యాగు ఎవరిదో ఇంకా నిర్ధారణ కాలేదని ఆయన చెప్పారు. గాయపడిన వారిలో బ్యాగు సమీపంలో కూర్చుని ఉన్న మహిళ కూడా ఉందని, ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందుతోందని ఆయన తెలిపారు.

టెక్నాలజీ హబ్ బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన ఘటనకు బాంబు పేలుడే కారణమని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పష్టం చేశారు. కేఫ్‌ ఆవరణలో ఒక కస్టమర్ వదిలివెళ్లిన బ్యాగ్‌లోని పేలుడు పదార్ధమే ఇందుకు కారణమని, సిలెండర్ పేలుడు కాదని రామేశ్వరం కేఫ్ వ్యవస్థపాకుడు నాగరాజ్ తనకు తెలిపినట్టు చెప్పారు. ఇది చాలా స్పష్టంగా బాంబు పేలుడు కేసుగా తెలుస్తోందని, దీనికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానం చెప్పాలని తేజస్వి సూర్య డిమాండ్ చేశారు.