చైనా బెట్టింగ్‌, లోన్ యాప్స్‌పై ఈడీ కొర‌డా

చైనా బెట్టింగ్‌, లోన్ యాప్స్‌పై ఈడీ కొర‌డా
* రూ. 123 కోట్ల విలువైన బ్యాంక్ డిపాజిట్స్‌ ఫ్రీజ్‌
 
చైనీస్ బెట్టింగ్, లోన్‌ యాప్స్‌పై ఈడీ ఉక్కుపాదం మోపింది. ముంబై, చెన్నై, కొచ్చి స‌హా దేశ‌వ్యాప్తంగా ప‌ది ప్ర‌దేశాల్లో సోదాలు నిర్వ‌హించిన ఈడీ అధికారులు రూ. 123 కోట్ల విలువైన బ్యాంక్ డిపాజిట్ల‌ను స్తంభింప‌చేశారు. పీఎంఎల్ఏ కింద ఈడీ బృందం చైనా బెట్టింగ్‌, లోన్ యాప్స్‌పై కొర‌డా ఝ‌ళిపించింది.

ఈనెల 23, 24న ముంబైలో ఎన్ఐయూఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌, చెన్నైలో క్సోడ‌జ్ సొల్యూష‌న్, విక్రా ట్రేడింగ్ ఎంట‌ర్‌ప్రైజెస్ స‌హా ప‌లు కంపెనీలు, కొచ్చిలోని ర‌ఫేల్ జేమ్స్ రొజారియా డైరెక్ట‌ర్ల నివాసాల‌పై దాడులు చేప‌ట్టామ‌ని ఈడీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 

ఈ సోదాల్లో ప‌లు డిజిట‌ల్ డివైజ్‌లు, ప‌త్రాలు, మనీ ల్యాండ‌రింగ్‌కు ఉప‌యోగించిన ప‌లు బ్యాంక్ ఖాతాల వివ‌రాలు ల‌భ్య‌మ‌య్యాయి. ప‌లు సంస్ధ‌ల‌, వ్య‌క్తుల స్ధిర‌, చ‌రాస్తుల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. 

చ‌ట్ట‌విరుద్ధంగా ఆన్‌లైన్ లోన్‌, గ్యాంబ్లింగ్‌, బెట్టింగ్ యాప్స్ ద్వారా అక్ర‌మంగా ఆర్జించిన సొమ్మును గుర్తించి నేరం ద్వారా స‌మ‌కూరిన సొమ్మును దారిమ‌ళ్లించిన తీరును ప‌సిగ‌ట్టేందుకు ఈ సోదాలు నిర్వ‌హించామ‌ని ఈడీ వ‌ర్గాఉ తెలిపాయి. చైనా సంస్ధ‌ల‌కు చెందిన ఆన్‌లైన్ లోన్‌, బెట్టింగ్ యాప్స్ ద్వారా జ‌రిగిన మోసాల‌పై కేర‌ళ‌, హ‌రియాణ పోలీసులు న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ద‌ర్యాప్తు చేప‌ట్టారు.