హిమాచల్ లో పతనం అంచున కాంగ్రెస్ ప్రభుత్వం .. మంత్రి రాజీనామా

హిమాచల్ లో పతనం అంచున కాంగ్రెస్ ప్రభుత్వం .. మంత్రి రాజీనామా
 
*15 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
 
హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యాన్ని న‌మోదు చేయడంతో ఆ పార్టీ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమైంది. బుధవారం ఇవాళ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న సంద‌ర్భంగా ఆ రాష్ట్ర స్పీక‌ర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల‌పై ఆయ‌న వేటు వేశారు. 
 
నినాదాలు చేస్తూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న ఎమ్మెల్యేల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు స్పీక‌ర్ కుల్దీప్ సింగ్ తెలిపారు. స్పీక‌ర్ ఛాంబ‌ర్‌లో నినాదాలు చేయ‌డంతో ఆయ‌న ఆ నిర్ణ‌యం తీసుకున్నారు. మరోవంక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరింత కష్టాల్లో పడింది. తాజాగా కాంగ్రెస్ మంత్రి విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
 
 హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభాసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ఈ మేరకు ప్రకటించారు. ఈ ప్రభుత్వంలో కొనసాగే హక్కు తనకు లేదని వెల్లడించారు. “నేను ఎవరికీ భయపడను, ఎక్కడ తప్పు జరిగినా మాట్లాడుతా”నని ఈ సందర్భంగా వెల్లడించారు. తాము ప్రియాంక గాంధీతో మాట్లాడామని మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ పరిశీలిస్తుందని భావిస్తున్నానని చెప్పారు.

ఇప్పుడు బంతి పార్టీ హైకమాండ్ వద్ద ఉందా, ప్రభుత్వం ఉందా లేదా అనే దానితో తమకు సంబంధం లేదని విక్రమాదిత్య స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎందుకు పడిపోయిందని మాకు తెలియదు. ఈ విషయాన్ని హైకమాండ్ పరిశీలించాలని కోరారు. తమ గొంతును అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ తాము దానిని సహించలేమని విక్రమాదిత్య తేల్చి చెప్పారు. ఇంతకుమించి ఎలా ముందుకు వెళ్లాలో కాలమే సమాధానం చెబుతుందని అంటూ  జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని పేర్కొన్నారు.

మంగ‌ళ‌వారం జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డ‌డంతో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన ఎమ్మెల్యేల్లో జైరాం ఠాకూర్‌, విపిన్ సింగ్ ప‌ర్మార్‌, ర‌ణ్‌దీర్ శ‌ర్మ‌, లాకెండ‌ర్ కుమార్‌, వినోద్ కుమార్‌, హ‌న్స్ రాజ్‌, జ‌న‌క్ రాజ్‌, బ‌ల్బీర్ వ‌ర్మ‌, త్రిలోక్ జంవాల్‌, సురేందర్ షోరి, దీప్ రాజ్‌, పురాన్ ఠాకూర్‌, ఇంద‌ర్ సింగ్ గంధి, దిలీప్ థాకూర్‌, ఇంద‌ర్ సింగ్ గంధీ ఉన్నారు.

క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్ ప్ర‌భుత్వం మైనార్టీలో ప‌డింద‌ని, సీఎం సుఖ్వింద‌ర్ సింగ్ రాజీనామా చేయాల‌ని బీజేపీ నేత జైరాం ఠాకూర్ డిమాండ్ చేశారు. మంత్రి విక్ర‌మాదిత్య సింగ్ రాజీనామా చేయ‌డంతో కాంగ్రెస్ పార్టీ మ‌రింత క‌ష్టాల్లో ప‌డిన‌ట్లు అయ్యింది. కాంగ్రెస్ స‌ర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టేందుకు ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లాను క‌లిశారు.