ఇస్రో స్పేస్‌పోర్ట్ ప్రారంభోత్స‌వ యాడ్‌పై చైనా జెండా

* డీఎంకేపై నిప్పులు చెరిగిన ప్రధాని

త‌మిళ‌నాడులో నూత‌న ఇస్రో స్పేస్‌పోర్ట్‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన‌ ప్ర‌క‌ట‌న‌లో చైనా జెండాతో కూడిన రాకెట్‌ను ప్ర‌ద‌ర్శించ‌డం వివాదాల‌కు కేంద్ర బిందువైంది. కుల‌శేఖ‌ర‌ప‌ట్నంలో ఇస్రో స్పేస్‌పోర్ట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర మ‌త్స్య‌శాఖ మంత్రి అనితా రాధాకృష్ణ‌న్ ఈ ప్ర‌క‌ట‌న‌ను జారీ చేశార‌ని చెబుతున్నారు.ఇందులో ప్రధానమంత్రి మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఇతర డీఎంకే నేతలతో పాటు చైనా జాతీయ జెండాతో ఉన్న రాకెట్ కనిపించడంతో దుమారం రేగింది.

దానితో ఈ ప్ర‌క‌ట‌న‌లో రాకెట్‌పై చైనా జెండా  ప్ర‌చురిత‌మ‌వ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ వ్యవ‌హారంపై స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా బీజేపీ విమ‌ర్శ‌లు గుప్పించింది. స్ధానిక దిన‌ప‌త్రిక‌ల్లో జారీ చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌ను బీజేపీ రాష్ట్ర చీఫ్ కే. అన్నామ‌లై ఖండించారు. దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని డీఎంకే అగౌర‌వ‌ప‌రుస్తోంద‌ని మండిప‌డ్డారు.ఇస్రో తొలి లాంఛ్ ప్యాడ్ సిద్ధ‌మైన‌ప్పుడు ఇస్రో తొలి ఎంపిక త‌మ‌ళ‌నాడేన‌ని అన్నామలై గుర్తుచేశారు.

కానీ ఈ విషయంలో డీఎంకే వ్యవహరించిన తీరు నిరాశపరిచింద‌ని చెప్పారు. అప్ప‌టి సిఎం తిరు అన్నాదురై ప్రతినిధి తాగిన మత్తులో రావ‌డం మన దేశ అంతరిక్ష కార్యక్రమం పట్ల డీఎంకే చిత్త‌శుద్ధిని తేట‌తెల్లం చేశాయ‌ని అన్నారు. డీఎంకే తీరు ఏమాత్రం మార‌లేద‌ని, మ‌రింత దిగ‌జారింద‌ని అన్నామ‌లై ఆక్షేపించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అధికార డీఎంకే పనిచేయకపోవడమే కాకుండా తప్పుడు క్రెడిట్ ఆపాదించుకుంటోందని, కేంద్రం పథకాలపై వాళ్ల (డీఎంకే) స్టిక్కర్లు అంటించుకున్నారని, ఇస్రో లాంచ్‌ప్యాడ్‌‌పై చైనా స్టిక్కర్ అంటించి క్రెడిట్ వారికి ఆపాదిస్తున్నారని విమర్శించారు. అంతరిక్ష రంగంలో భారతదేశ ప్రగతిని అంగీకరించేందుకు వాళ్లు (డీఎంకే) సిద్ధంగా లేదన్నారు. అంతరిక్ష రంగంలో భారత విజయాలను ప్రపంచానికి చాటేందుకు ఇష్టపడటం లేదని, మన శాస్త్రవేత్తలను, మన అంతరిక్ష కేంద్రాన్ని కూడా విమర్శిస్తున్నారని తప్పుపట్టారు. వాళ్లు చేసిన తప్పదాలకు శిక్ష విధించే సరైన సమయం ఇదేనని అన్నారు.

అయితే, చైనా రాకెట్ యాడ్‌పై మోదీ వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ కె.కనిమొళి తిప్పికొట్టారు. యాడ్ ఫోటోలో ఆర్ట్ వర్క్ చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలిదని తెలిపారు. చైనాను శత్రుదేశంగా భారత్ ప్రకటించినట్టు తాను అనుకోవడం లేదని చెప్పారు. ”మన ప్రధాని చైనా ప్రధానిని ఆహ్వానించాను. కలిసి మహాబలిపురం వెళ్లారు. నిజాన్ని ఒప్పుకోవడానికి మీరు (ప్రధాని) సిద్ధంగా లేనందునే సమస్యను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు” అని కనిమొళి వ్యాఖ్యానించారు.