ఛత్తీస్ గఢ్ లో నలుగురు నక్సలైట్లు హతం

ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి కొనసాగుతున్న ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. భద్రతాబలగాలు తెలిపిన వివరాల ప్రకారం  ఛత్తీస్ గఢ్ లో లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ లో భాగంగా జిల్లా రిజర్వ్ గార్డ్ బృందం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సి ఆర్ పి ఎఫ్) బృందం వేర్వేరుగా మంగళవారం తెల్లవారు జామున బయల్దేరాయి. 
 
వారికి జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో ఉదయం 11 గంటల సమయంలో నక్సల్ బృందాలు తారసపడ్డాయి. దాంతో, ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఈ చత్తీస్ గఢ్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరుగుతుండగానే, భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతూ, నక్సలైట్లు అటవీ ప్రాంతంలో మరింత లోపలకు వెళ్లారని, ఆ తరువాత ఆ ప్రాంతంలో గాలింపు జరపగా తమకు నాలుగు మృతదేహాలు కనిపించాయని ఆయన వెల్లడించారు. 
 
ఆ మృతదేహాలను ఇంకా గుర్తించలేదని, పోస్ట్ మార్టం నిమిత్తం వాటిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. సంఘటనా స్థలం నుంచి పిస్తోళ్లు, ఐఈడీలు, కొంత మావోయిస్ట్ సాహిత్యం, ఇతర మావోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని డీఐజీ తెలిపారు. భద్రతా దళాలు ఇంకా అడవిలోనే ఉన్నాయని, ఎన్ కౌంటర్ కొనసాగుతోందని మంగళవారం మధ్యాహ్నం తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.