నౌకా దళానికి ప్రధాన ఆయుధం బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణే !

నౌకా దళానికి ప్రధాన ఆయుధం బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణే !
భారత నౌకా దళానికి ఇప్పుడు ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణే ఇప్పుడు తమ ప్రధాన ఆయుధం కానున్నదని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరికుమార్‌ తెలిపారు. ఇతర దేశాల నుంచి సమకూర్చుకున్న పాతకాలపు క్షిపణి వ్యవస్థ స్థానంలో బ్రహ్మోస్‌ క్షిపణి వ్యవస్థను తీసుకొచ్చామని, ఇదే ఇప్పుడు నేవీలో ప్రధాన ఆయుధం కానున్నదని నేవీ చీఫ్‌ పేర్కొన్నారు. 

సోమవారం పుణేలో జరిగిన డిఫెన్స్‌ ఎక్స్‌పోలో ముగింపు వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు.  ‘ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్‌ క్షిపణి ఇప్పుడు మాకు ప్రధాన ఆయుధం కాబోతున్నది. వైమానిక దళంలో, యుద్ధ విమానాల్లో కూడా బ్రహ్మోస్‌ క్షిపణే ప్రధాన ఆయుధం కానుంది. ఈ క్షిపణి సామర్థ్యాలు, పరిధిని మెరుగు పర్చారు.

కాబట్టి పాతకాలపు క్షిపణి వ్యవస్థ స్థానంలో బ్రహ్మోస్‌ను స్థాపితం చేస్తున్నాం’ అని నేవీ చీఫ్‌ చెప్పారు.‘బ్రహ్మోస్‌ చాలా శక్తిమంతమైన క్షిపణి. దీని పరిధి, సామర్థ్యం దేశీయంగానే మెరుగు చేశారు. నిజం చెప్పాలంటే బ్రహ్మోస్‌ క్షిపణి ఇక దేశంలోనే తయారవుతుంది. ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. దేశంలోని ఈ క్షపణి రిపేర్‌ చేయవచ్చు. స్పేర్‌ పార్ట్స్‌ కూడా ఇక్కడే లభ్యమవుతాయి. కాబట్టి ఇది భారత్‌కు చాలా సానుకూలాంశం’ అని ఆయన పేర్కొన్నారు.

త్వరలో 200కు పైగా క్షిపణుల కొనుగోలుకు సంబంధించిన రూ.19 వేల కోట్ల డీల్‌కు భారత క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ క్లియరెన్స్‌ ఇచ్చిన కొన్ని రోజులకే నేవీ చీఫ్‌ హరికుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ డీల్‌పై బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమెటెడ్‌, భారత రక్షణ శాఖ వచ్చే నెల 5న సంతకాలు చేయనున్నాయి. బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ అనేది 1998లో ఏర్పాటైన భారత్‌-రష్యా జాయింట్‌ వెంచర్‌.