
దేశవ్యాప్తంగా ఐదు చోట్ల నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా ఎయిమ్స్‌లను ప్రారంభిస్తూ జాతికి అంకితం చేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌తోపాటు రాజ్‌కోట్, ఉత్తరప్రదేశ్‌లోని రారుబరేలి, పంజాబ్ రాష్ట్రంలోని బఠిండా, పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణి నగరాల్లో నిర్మించిన ఎయిమ్స్‌లను ప్రధాని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,618 కోట్లతో నిర్మించిన ఎయిమ్స్‌లో 960 పడకలతో 125 మెడికల్ సీట్లు వున్నాయి. దీనికి 2015లో శంకుస్థాపన జరగ్గా, 2019 నుంచి ఓపి సేవలు మొదలయ్యాయి. దాదాపు ఐదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు జాతికి అంకితం చేశారు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో రూ.23.75 కోట్లతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మెడికల్ కళాశాలలో రూ.23.75 కోట్లతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
విశాఖపట్నం పెదవాల్తేరులోని స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్‌లో నిర్మించిన మైక్రో బయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నరు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు భారతి ప్రవీణ్ పవార్, ప్రహ్లాద్ జోషి, వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని, రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు, సిఎం రమేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి తదితరులు పాల్గన్నారు.
ఇలా ఉండగా, మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిమ్స్ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని వివరాలు తెలిపేలా ఓ ఫ్లెక్సీని బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. పూర్తిగా కేంద్రం నిధులతోనే ఎయిమ్స్ నిర్మాణం చేశారని ఫ్లెక్సీలో వివరించారు. అయితే ఫ్లెక్సీ ఏర్పాటుపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఫ్లెక్లీ తొలగించేందుకు పోలీసులు ఆస్పత్రి దగ్గరకు వచ్చారు. పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఏపీ ప్రభుత్వానికి లేని బాధ పోలీసులకు ఎందుకని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడ తోపులాట జరగడంతో బీజేపీ శ్రేణులు గాయపడ్డారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ