వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్

* యువ‌త‌పై రాహుల్ దిగ‌జారుడు వ్యాఖ్య‌లు.. ప్రధాని ఆగ్రహం 

భారత్ వచ్చే ఐదు సంవత్సరాలలో అభివృద్ధికి నమూనాగా మారనున్నదని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసిలో ప్రకటించారు. అది ‘మోడీ గ్యారంటీ’ అని ఆయన చెప్పారు. కాశీని ఒక ఉదాహరణగా ప్రధాని పేర్కొంటూ, సంస్కృతి, సంప్రదాయం ఆధారంగా ఆధునికతను ఏవిధంగా మెరుగుపరచవచ్చో ప్రపంచం చూస్తోందని చెప్పారు.

ఆయన బెనారస్ హిందు విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు)లో ‘సంసద్ సంస్కృత ప్రతియోగిత’ విజేతలతో ఇష్టాగోష్ఠి సాగిస్తూ ‘కాశీని ఇప్పుడు ప్రపంచం అంతటా అభివృద్ధికి, వారసత్వ సంపదకు నమూనాగా పరిగణిస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయం ప్రాతిపదికగా ఆధునికతను ఏవిధంగా మెరుగుపరచవచ్చో ప్రపంచం చూస్తున్నది’ అని ప్రధాని విశ్వవిద్యాలయంలో ప్రసంగం సందర్భంగా చెప్పారు. 

‘రానున్న ఐదు సంవత్సరాలలో దేశం అభివృద్ధికి ప్రతీకగా మారుతుంది. అది మోడీ గ్యారంటీ’ అని ఆయన చెప్పారు. భారత సుసంపన్న వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని ఆయన తెలిపారు. అయోధ్యలో జనవరి 22న రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని మోదీ  ప్రస్తావిస్తూ, ‘రామ్ లల్లా కొత్త విగ్రహం ప్రతిష్ఠాపన దరిమిలా అయోధ్య కాశీ వలే పరిఢవిల్లుతుండడాన్ని ప్రపంచం తిలకిస్తోంది’ అని చెప్పారు. 

అదే విధంగా బుద్ధునికి సంబంధించిన ప్రదేశాలను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు, కుషీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించినట్లు ప్రధాని వెల్లడించారు. కాశీ ‘వైభవాన్ని’ మోదీ  అభివర్ణిస్తూ, ‘ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన, విభిన్న భాషలు, మాండలికాలు మాట్లాడుతున్న ప్రజలు కాశీలో స్థిరపడ్డారు. అటువంటి విభిన్నత్వం ఉన్న ప్రదేశంలో కొత్త భావనలు పుట్టుకువస్తున్నాయి’ అని ఆయన తెలిపారు.

 ‘అందుకే విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంలో అది భారత్ కొత్త పంథాను నిర్దేశిస్తుందని, భారత్‌ను మహోజ్వల భవిత దిశగా తీసుకువెళుతుందని చెప్పాను’ అని ప్రధాని గుర్తు చేశారు.  ‘అమృత్ కాల్’ సమయంలో యువ తరం దేశాన్ని సమున్నత శిఖరాలకు తీసుకువెళుతుండడం గర్వ కారణం అని మోదీ పేర్కొన్నారు. 

‘కాశీ కేవలం పుణ్య క్షేత్రం కాదు. అది భారత శాశ్వత విజ్ఞతకు చైతన్య కేంద్రం కూడా’ అని ప్రధాని తెలిపారు. అంతకు ముందు ప్రధాని మోదీ కాశీ సంసద్ జ్ఞాన్ ప్రతియోగిత, కాశీ సంసద్ ఫోటోగ్రఫీ ప్రతియోగిత, కాశీ సంసద్ సంస్కృత ప్రతియోగిత విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు.

ఇలా ఉండగా, వార‌ణాసిలో కొంద‌రు యువ‌కులు త‌ప్ప‌తాగి రోడ్ల‌పై ప‌డిఉండ‌టం చూశాన‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. త‌న లోక్‌స‌భ నియోజ‌క‌వర్గంలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ రాహుల్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. మ‌తిస్ధిమితం కోల్పోయిన వారు కాశీలోని పిల్ల‌ల‌ను తాగుబోతుల‌ని అంటున్నార‌ని రాహుల్ పేరు ప్ర‌స్తావించ‌కుండా ప్ర‌ధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ యువ‌రాజు వార‌ణాసి ప్ర‌జ‌ల‌ను వారి సొంత గ‌డ్డ‌పైనే అవ‌మానించార‌ని దుయ్య‌బ‌ట్టారు. రెండు ద‌శాబ్ధాలుగా మోదీని ద్వేషించిన వారు ఇప్పుడు యూపీ యువ‌త‌పై త‌మ ద్వేషాన్ని వెళ్ల‌గ‌క్కుతున్నార‌ని ఆరోపించారు. యూపీ యువ‌తను విప‌క్ష ఇండియా కూట‌మి అవ‌మానించిన తీరును తానెన్న‌డూ మ‌రిచిపోన‌ని పేర్కొన్నారు. కాశీ, అయోధ్య కొత్త రూపు సంత‌రించుకోవ‌డం ఇండియా కూట‌మి నేతల అస‌హ‌న‌నానికి మ‌రో కార‌ణ‌మ‌ని చెప్పారు.

ఇండియా కూటమి తమ కుటుంబాల కోసమే!

ఇండియా కూట‌మి తమ కుటుంబాల కోసం ప‌నిచేస్తుంద‌ని, పేద‌ల సంక్షేమం వారికి ప‌ట్ట‌ద‌ని ప్రధాని ఆరోపించారు. విప‌క్ష కూట‌మి కులం పేరుతో క‌ల‌హాల‌కు దిగుతూ ద‌ళితులు, అణ‌గారిన‌వ‌ర్గాల సంక్షేమానికి ఉద్దేశించిన ప‌ధ‌కాల‌ను వ్య‌తిరేకిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. పేద‌ల సంక్షేమం పేరుతో విప‌క్ష నేత‌లు త‌మ కుటుంబాల కోసం రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ప్ర‌ధాని మండిప‌డ్డారు.

కుటుంబ‌వాదం, అవినీతి, బుజ్జ‌గింపుధోర‌ణుల కార‌ణంగా యూపీ ద‌శాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోలేద‌ని విమర్శించారు. ఎన్నిక‌లు జ‌రిగిన ప్ర‌తి సారీ విప‌క్ష పార్టీలు జ‌ట్టు కట్టి ఆపై ఫ‌లితాలు నిరాశాజ‌న‌కంగా రావ‌డంతో త‌మ‌లో తాము క‌ల‌హించుకుంటాయ‌ని మోదీ ఎద్దేవా చేశారు. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో దేశ‌మంత‌టా మోదీ గ్యారంటీకి అనుకూలంగా ఉన్నాయ‌ని చెబుతూ యూపీలోని అన్ని సీట్ల‌నూ ఎన్డీయే కైవసం చేసుకుంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

బీజేపీ ప్ర‌భుత్వం అంద‌రి కోసం ప‌నిచేస్తుంద‌ని, ఈ ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు అంద‌రికీ వ‌ర్తిస్తాయ‌ని ప్రధాని చెప్పారు. స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రి అభ్యున్న‌తి కోసం త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. స‌మాజంలో అణ‌గారిన వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ద‌క్కిన‌ప్పుడే స‌మాన‌త్వం సిద్ధిస్తుంద‌ని చెబుతూ అభివృద్ధికి దూరంగా ఉన్న వ‌ర్గాల‌ను కలుపుకుపోయేలా గ‌త ప‌దేండ్లుగా క‌స‌ర‌త్తు సాగుతోంద‌ని చెప్పారు. గ‌తంలో పేద‌ల‌ను చివ‌రి వ్య‌క్తులుగా చూసే ప‌రిస్ధితి ఉండేద‌ని, త‌మ హ‌యాంలో వారికోసం భారీ ప‌ధ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేశామ‌ని ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు.