సిద్దరామయ్య, రాహుల్ గాంధీలకు కోర్టు సమన్లు

సిద్దరామయ్య, రాహుల్ గాంధీలకు కోర్టు సమన్లు

* జార్ఖండ్ హైకోర్టులో రాహుల్‌కి చుక్కెదురు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కర్ణాటక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీతోపాటు కర్ణాటక ముఖ్యమంత్రి,  ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు కూడా సమన్లు ఇచ్చింది. గత కర్ణాటక ప్రభుత్వం 40 శాతం కమీషన్లు తీసుకుంటుందని రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ అంశాన్ని బీజేపీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాది వినోద్ కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆ పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం మార్చి 28వ తేదీన కోర్టుకు హాజరుకావాలని రాహుల్, సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లకు స్పష్టం చేసింది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పే సీఎం పోస్టర్లను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించింది. పోస్టర్ మీద అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఫొటో, క్యూఆర్ కోడ్ ముద్రించారు. బీజేపీ పాలనలో 40 శాతం కమీషన్ అని తీవ్ర ఆరోపణలు చేశారు.

దానిపై న్యాయవాది వినోద్ కుమార్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ వేశారు. 40 శాతం కమీషన్ ఆరోపణలకు సంబంధించి కేసు విచారణను 6 వారాల్లో పూర్తి చేయాలని కర్ణాటక హైకోర్టు గత వారం స్పష్టం చేసింది. దాంతో రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు జారీచేసింది.

మరోవంక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఓ హత్య కేసులో నిందితుడిగా ఆరోపిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జార్ఖండ్‌లో కేసు నమోదు కాగా, దాన్ని కొట్టివేయాలంటూ రాహుల్ అక్కడి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారించిన జార్ఖండ్ హైకోర్టు రాహుల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ నిర్ణయం వెలువరించింది.

 2018 మార్చి 18న జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రసంగించారని, అమిత్ షాను హత్యా నిందితుడిగా అభివర్ణించారని ఆరోపిస్తూ బీజేపీ నేత నవీన్ ఝా రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. లోయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తరువాత దాన్ని జార్ఖండ్ హైకోర్టుకు తరలించారు. ఈ ఘటనలో రాహుల్‌పై పరువునష్టం కేసు నమోదు చేశారు.