కవితకు మళ్లీ సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు బుధవారం సీబీఐ మరోసారి నోటీసులను జారీచేసింది. ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలని ఈ-మెయిల్‌ ద్వారా పంపిన ఆ నోటీసుల్లో పేర్కొంది. సీబీఐ కవితను ఇప్పటికే రెండుసార్లు విచారించిన విషయం తెలిసిందే. 2022 డిసెంబరులో బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. 
 
ఈడీ కూడా ఆమెకు గతంలో నోటీసులను జారీ చేసింది. అప్పట్లో ఢిల్లీలో సుదీర్ఘంగా విచారించింది. కవిత తాను వాడిన సెల్‌ఫోన్లను ఈడీకి అందజేశారు. కాగా, ఈ కేసులో అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగానే సీబీఐ కవితకు మరోమారు నోటీసులను జారీ చేసినట్లు తెలిసింది. 
ఈ కేసులో సౌత్‌గ్రూప్‌ నుంచి నిందితుల్లో ఒకరైన విజయ్‌ నాయర్‌ ఆమ్‌ అద్మీ పార్టీ (ఆప్‌) తరఫున రూ.100 కోట్ల మేరకు ముడుపులు స్వీకరించినట్లు ఈడీ ఆరోపించింది.
సౌత్‌గ్రూ్‌పలో కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి తదితరులున్నారు.  ఈడీ నోటీసులు జారీ అయిన నెలలోనే సీబీఐ తాఖీదులివ్వడం గమనార్హం. ఈడీ నోటీసులపై కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున కవిత వి చారణకు హాజరుకాలేదు. అయితే సీబీఐ నోటీసులకు స్పందించాలా? విచారణకు హాజరవ్వాలా? అనే అంశంపై న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత కవిత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
 
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా పలువురు నిందితులపై ఇప్పటి వరకు మూడు ఛార్జిషీట్‌లు దాఖలు చేసిన సీబీఐ, ఢిల్లీలోని అధికార ఆప్‌కి చెందిన కొందరు రాజకీయ నాయకులకు, ఇతర ప్రజలకు సుమారు రూ.90-100 కోట్ల వరకు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు ఆరోపించింది. మరోవైపు, ఈ కేసులో కవిత చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లై, శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లిలను కూడా ఈడీ అరెస్ట్ చేసింది.
అయితే, మాగుంట రాఘవరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారగా వారిద్దరికీ బెయిల్ మంజూరైంది. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని రామచంద్ర పిళ్లై అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మిగతావారు జైల్లోనే ఉన్నారు.