
అంతర్జాతీయ నావికాదళ దేశాలతో రక్షణ సంబంధాలు, సముద్ర భద్రత లక్ష్యంగా తూర్పు నావికాదళం వేదికగా సోమవారం విశాఖలో మిలాన్-2024 ఆరంభమైంది. తొలి రోజు ప్రీ సెయిల్ డిస్కషన్స్ వంటి కార్యక్రమాలే సాగాయి. మిలాన్‌కు సంబంధించి 50 దేశాలకు ఆహ్వానాలు పంపగా, 20 దేశాల నౌకలు విశాఖ తీరానికి ఇప్పటికే చేరుకున్నాయి.
సోమ, మంగళవారాల్లో అనధికారిక సన్నాహాల్లో నేవీ నిమగమైంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ నెల 21న హార్బర్ ఫేజ్ విన్యాసాలను ఐఎన్‌ఎస్ సముద్రిక ఆడిటోరియంలో ప్రారంభించనున్నారు. 22న ఉదయం ఎన్‌ఎస్‌టిఎల్‌లోని సముద్రిక ఆడిటోరియంలో జరిగే నేవీ వేడుకలో ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ పాల్గొననున్నారు.
ఈ నెల 23 వరకూ హార్బర్ ఫేజ్‌లోనే ఈ విన్యాసాలు జరగనున్నాయి. 22న సాయంత్రం ఆర్‌కె బీచ్‌లో జరగనున్న మిలాన్ సిటీ పరేడ్ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తీరంలో వివిధ దేశాల నావికాదళ అధికారులు, సిబ్బంది నిర్వహించే పరేడ్, నౌకల విన్యాసాలను ఆయన తిలకించనున్నారు.
ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకూ బంగాళాఖాతంలో వివిధ దేశాల నావికాదళాల నౌకలు, యుద్ధ విమానాలు, జలాంతర్గాముల మధ్య పరస్పర విన్యాసాలు, టెక్నాలజీకి సంబంధించిన దేశాల మధ్య చర్చలు, డ్రిల్స్ వంటివి జరగనున్నాయి. యుద్ధ విమానాలను తీసుకెళ్లే భారీ నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య విశాఖలోని గంగవరం పోర్టుకు సోమవారం చేరుకుంది. మొట్టమొదటసారిగా ఈ నౌక విశాఖకు విచ్చేసింది.
మరో ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్ అయిన ఐఎన్‌ఎస్ విక్రాంత విశాఖ హార్బర్‌కు చేరుకుంది. ప్రస్తుతం యద్ధనౌకలన్నీ విశాఖ తీరానికి కాస్త దూరంలో యాంకరింగ్‌లో ఉన్నట్లు నావికాదళాధికారులు తెలిపారు. ఈ నెల 24 నుంచి నావికాదళాల విన్యాసాలు సముద్రంలో ప్రారంభం కానున్నాయి. 27తో ముగియనున్నాయి. ప్రస్తుతం విదేశాల నుంచి ఒక్కొక్కటిగా నౌకలు విశాఖ సముద్రానికి చేరుతున్నాయి. ఇదిలా ఉండగా, మూడు రోజుల నుంచి నేవీ ఆధ్వర్యాన సాగుతున్న రిహార్సల్స్ ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. మిగ్‌లు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి.
More Stories
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచనే లేదు
మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీ అరెస్ట్