ఎన్నిక‌ల శంఖ‌రావం పూరించిన కిష‌న్ రెడ్డి

ఎన్నిక‌ల శంఖ‌రావం పూరించిన కిష‌న్ రెడ్డి
నారాయణపేటలో బీజేపీ విజ‌య సంక‌ల్ప ప్ర‌జాయాత్ర‌తో ఎన్నికల ప్రచారాన్ని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మంగళవారం శంఖ‌రావం పూరించారు. కృష్ణవేణి విగ్రహంతోపాటు అక్కడ గోమాతకు పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేసేందుకు ఒకేసారి ఐదు యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
 
అగ్రనేతలు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు వీలుగా ఒకేసారి ఐదు ప్రాంతాల్లో యాత్రలు చేపట్టామని పేర్కొన్నారు. తెలంగాణలో తెలంగాణ బీజేపీకి స్పష్టమైన ప్రజా మద్దతు ఉందని, తాము ఒంటరిగానే గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏ రాజకీయ పార్టీతో పొత్తు ఉండదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 17 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌- బీజేపీ పొత్తు అంటే ఎవరైనా దాన్ని తిప్పికొట్టాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు పోటీ చేసి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీజేపీకి మునిగిపోతున్న బీఆర్ ఎస్ తో కలవబోదని స్పష్టం చేశారు. 

గతంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. కొందరు అక్రమార్కులు కుట్రపూరితంగా ఈ ప్రచారం చేస్తున్నారని చెబుతూ బుద్ధి లేని వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. నేటి నుంచి రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో మొత్తం 5,500 కిలోమీటర్ల మేర పార్టీ ఆధ్వర్యంలో ‘విజయ సంకల్ప యాత్ర’ చేపట్టనున్నట్లు వివరించారు.

బీజేపీ శ్రేణులను ప్రజలు ఆశీర్వదించాలని, బహిరంగ సభలు ఉండవని, రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు తొలి సమావేశంలోనే తెలంగాణ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఈ యాత్రలు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. 

20వ తేదీ నుంచి నాలుగు యాత్రలు సమాంతరంగా ప్రారంభమవుతాయని, అయితే మేడారం జాతర కారణంగా వరంగల్ యాత్ర కొన్ని రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుందని తెలిపారు. యాత్రలో భాగంగా  రైతులు, చేతివృత్తిదారులు, నిరుద్యోగులు, పొదుపు సంఘాల మహిళలు, అన్ని వర్గాల ప్రజలను కలుస్తామ‌ని చెప్పారు.

కేంద్రంలో మోదీ  అవినీతి రహితపాలన అందిస్తున్నారని చెబుతూ దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పదేళ్లలో 4 కోట్ల ఇళ్లు కట్టించటం జరిగిందని పేర్కొన్నారు. దురదుష్టవశాత్తు తెలంగాణలో బీఆర్ఎస్ వైఖరి వల్ల ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగలేదని ధ్వజమెత్తారు. నిరుపేదలు వైద్య కోసం ఇబ్బందులు పడకుండా కేంద్రం చర్యలు చేపడుతుందని చెప్పారు.

‘‘గతంలో తెలంగాణలో కేసీఆర్కుటుంబం ఖానా.. పీయా.. చెలేగయా.. ఇప్పుడు తెలంగాణ సంపదను దోచుకుని లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్  చూస్తోంది’’ అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో టెర్రరిస్టులు, ఉగ్రవాదులు పెట్రేగిపోయారని మండిపడ్డారు. నేడు ఉగ్రవాదాన్ని మోదీ ఉక్కుపాదంలో అణచివేయటంతో దేశం ప్రశాంతంగా ఉందని తెలిపారు. 

వచ్చే లోక్‌సభ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలనే విషయాన్ని జనాలు గమనించాలని కోరారు. పిల్లల, దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం మోడ్ మూడోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే. అరుణ, మాజీ ఎంపీ ఏపీ. జితేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.