ఎన్నికల్లో తప్పులు.. పాక్ ఎన్నికల అధికారి రాజీనామా

ఎన్నికల్లో తప్పులు.. పాక్ ఎన్నికల అధికారి రాజీనామా
పాకిస్థాన్‌ ఎన్నికల్లో తప్పులు చేసినట్లు ఒప్పుకున్న ఒక ఎన్నికల అధికారి రాజీనామా చేశారు. పోల్ రిగ్గింగ్‌, ఫలితాల మార్పులో ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ తప్పులన్నింటికీ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్లు సీనియర్‌ అధికారి, రావల్పిండి ఎన్నికల కమిషనర్ లియాఖత్ అలీ చత్తా తెలిపారు. 
 
శనివారం స్థానిక క్రికెట్‌ స్టేడియంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులను గెలిపించారని, ఫలితాలను తారుమారు చేశారని ఆయన ఆరోపించారు.  అందుకనే దేశానికి వెన్నుపోటు పొడిచిన తనకు నిద్ర పట్టలేదని లియాఖత్ అలీ చత్తా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రధాన న్యాయమూర్తి కలిసి ఎన్నికల రిగ్గింగ్ కు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణ చేశారు.
 
ఈ అన్యాయానికి పాల్పడిన తనతోపాటు మరికొందరికి శిక్ష పడాలని స్పష్టం చేశారు. ఆత్మహత్య గురించి ఆలోచించేంత ఒత్తిడి తనపై ఉందని తెలిపారు. అయితే ప్రజలకు అసలు విషయం తెలియజేయాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాజకీయ నాయకుల కోసం ఎలాంటి తప్పులు చేయవద్దని మొత్తం అధికార వర్గానికి తన విన్నపమని పేర్కొన్నారు.మరోవైపు ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై లియాఖత్ అలీ చత్తా చేసిన ఆరోపణలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) ఖండించింది. ఎన్నికల ఫలితాలు మార్చాలని ఎన్నికల సంఘంలోని ఏ అధికారి కూడా రావల్పిండి కమిషనర్‌కు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపింది. అయినప్పటికీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. 

అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ రాజీనామా చేయాలని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పీటీఐ డిమాండ్‌ చేసింది. ఎన్నికల్లో రిగ్గింగ్‌, ఫలితాల తారుమారుపై పాకిస్థాన్‌ వ్యాప్తంగా ఆ పార్టీ నిరసనలు చేపట్టింది.

ప్రతిపక్షంలో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ

మరోవంక, పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ-ఇన్సాఫ్‌ (పిటిఐ) పాకిస్థాన్‌ పార్లమెంట్‌లో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని నిర్ణయించింది. ఇటీవలే జరిగిన పాకిస్థాన్‌ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు సరైన వాతావరణం లేకపోవడంతో పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీటీఐకి చెందిన బారిస్టర్‌ అలీ సయూఫ్‌ ప్రకటించారు. 
 
పార్టీ తన ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉమర్ అయూబ్ ఖాన్‌, పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అస్లాం ఇక్బాల్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత పీటీఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.  ఇస్లామాబాద్‌లో అలీ సయూఫ్‌ మీడియాతో మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ ఖాన్ సూచనల మేరకు ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 
 
ఓట్లు, సీట్లను తారుమారు చేయకుంటే నేడు తమ పార్టీకి 180 స్థానాలు వచ్చి ఉండేవని స్పష్టం చేశారు. మొత్తం 177 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నట్లు చెప్పారు. అయితే, వాటిలో 85 సీట్లను తమ నుంచి మోసపూరితంగా లాగేసుకున్నారని ఆరోపించారు. అందుకే తమ అభ్యర్థులు గెలిచినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.