
* సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందే ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19 (1)(ఏ)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం కల్గిస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌కు చట్టబద్ధత ఉంటుందా లేదా అన్న పిటీషన్లపై కోర్టు తీర్పును వెలువరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయి, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలు ఆ ధర్మాసనంలో ఉన్నారు. ఈ కేసులో గతేడాది నవంబరులోనే విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
తాజాగా, గురువారం నాడు తీర్పు వెలువరించింది. ఎన్నికల బాండ్లపై ఏకగ్రీవ తీర్పు ఇవ్వనున్నట్లు సీజేఐ వెల్లడించారు. ధర్మాసనంలోని సభ్యుల మద్య రెండు అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో పాటు తాను కూడా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సీజేఐ తెలిపారు. సరైన ఓటింగ్ ప్రక్రియను తెలుసుకునేందుకు రాజకీయ నిధుల గురించి సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీజేఐ అన్నారు. ఇది ఓ విధంగా ప్రాథమిక హక్కులకు ఉల్లంఘనేనని ధర్మాసనం పేర్కొంది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని వ్యాఖ్యానించింది.
రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడో ప్రోకోకు దారితీస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. విరాళాలు అందజేసిన వారి వివరాలను రహస్యంగా ఉంచడం సమంజసం కాదని తెలిపింది. రాజకీయ పార్టీలకు ఎవరు విరాళం ఇచ్చారో తెలియాల్సిన ఆవశ్యకత ఉందని ధర్మాసనం పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకున్న ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
‘‘ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమే. నల్లధనాన్ని అరికట్టాలనే కారణంతో ఆర్టీఐ చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదు. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించింది. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సింది.’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ పథకాన్ని నిలిపివేసిన సుప్రీంకోర్టు జారీ చేసే బ్యాంకులు తక్షణమే బాండ్లను నిలిపివేయాలని కోర్టు తన తీర్పులో తెలిపింది. ఎన్నికల కమిషన్‌లు, సెబీలు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆదేశించింద నిధులు అందుకున్న రాజకీయ పార్టీలు వివరాలను ఎస్‌బీఐ బ్యాంకు వెల్లడించాలని కోర్టు కోరింది.
మార్చి 6వ తేదీలోగా ఎన్నికల సంఘానికి ఆ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి బాండ్‌కు చెందిన వివరాలను ఎస్బీఐ వెల్లడించాలి. మార్చి 13వ తేదీ వరకు తమ అధికారిక వెబ్‌సైట్ ఎన్నికల సంఘం ఆ సమాచారాన్ని పోస్టు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీలు ఖాతాలో జమా చేయకుంటే, వాటిని రిటర్న్ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఎలక్టోరల్ బాండ్లు ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లభిస్తాయి. వీటిని కొనుగోలు చేసి నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు విరాళంగా వచ్చిన ఎలక్టోరల్ బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి.
రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్డీయే ప్రభుత్వం 2018లో ఈ ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని తీసుకొచ్చింది.
రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. తద్వారా ఎలక్టోరల్ బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారించిన సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు వెలువరించింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు