పాక్ ప్రధానిగా నవాజ్ సోదరుడు షెహబాజ్‌!

ఆశ్చర్యకరమైన పరిణామంలో, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన తమ్ముడు షెహబాజ్‌ను తదుపరి ప్రధానమంత్రి పదవికి నామినేట్ చేశారు, అయితే నవాజ్ద షరీఫ్ తదుపరి ప్రధానమంత్రి అవుతారని అంతకు ముందు పార్టీ సమాచార కార్యదర్శి మర్రియం ఔరంగజేబు ప్రకటించారు.
 
మరోవంక, మాజీ ప్రధాని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి పదవికి తన కుమార్తె మరియం నవాజ్‌ను నామినేట్ చేశారు, ఎన్నికైతే ఆ పదవిలో పనిచేసిన మొదటి మహిళగా ఆమె అవుతారు. అంతకు ముందు నవాజ్ షరీఫ్ నాల్గవసారి ప్రధాని పదవి పెట్టబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

కాగా, ఈ నెల 8న ముగిసిన ఎన్నికలలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల గురించి షరీఫ్ తమ్ముడు షెహ్‌భాజ్ మాట్లాడుతూ, పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ (పిఎంఎల్-ఎన్) ప్రముఖులు ఓడిపోయారని, స్వతంత్ర అభ్యర్థులు గెలిచారని చెప్పారు. ‘ఖైబర్ ఫఖ్తూన్‌క్వాలో అధిక సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అంటే అక్రమాల ద్వారానే వారు గెలిచారని దానికి అర్థమా? సింధ్, బలూచిస్తాన్‌లలో స్వతంత్రుల జాడే లేదు’ అని ఆయన ప్రశ్నించారు.

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మినహా అన్ని ప్రధాన పార్టీలు పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని ప్రకటించడంతో, భవిష్యత్తు ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న  ఊహాగానాలకు తెరపడింది. పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ తన అన్నయ్య నవాజ్ రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రధానమంత్రి అవుతారని తొలుత మంగళవారం ధృవీకరించారు.
 
 పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి)కి చెందిన ఆసిఫ్ అలీ జర్దారీ, ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ కి చెందిన ఖలీద్ మక్బూల్ సిద్ధిఖీతో షెహబాజ్, సంప్రదింపుల సమావేశం తర్వాత పాకిస్తాన్ ముస్లిం లీగ్-క్వైద్ కి చెందిన షుజాత్ హుస్సేన్ నివాసంలో సమావేశమయ్యారు.

పోటీ నుంచి తప్పుకున్న బిలావల్ భుట్టో

మరోవంక, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ప్రధాని పదవి రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లింలీగ్ – నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ నేత అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు. అయితే,  ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండబోవడం లేదని స్పష్టం చేశారు.
 
పీపీపీ అత్యున్నత స్థాయి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం తర్వాత బిలావల్ భుట్టో మీడియాతో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. పాకిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడంలో విఫలమైనందున ప్రతిపక్షంలో ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు.  పీఎంఎల్ -ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ నాలుగో దఫా పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారని మాజీ ప్రధాని షానవాజ్ షరీఫ్ ప్రకటించిన గంటల్లో నవాజ్ షరీఫ్‌కు బిలావల్ భుట్టో మద్దతు పలుకడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
 
పీపీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇమ్రాన్ ఖాన్ సారధ్యంలోని పాకిస్థాన్ ఈ ఇన్సాఫ్ నిరాకరించింది.  ఈ నేపథ్యంలో తనంతట తాను ప్రధాని పదవికి పోటీ పడబోవడం లేదని బిలావల్ భుట్టో జర్దారీ ప్రకటించారు. దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొల్పేందుకు, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని పార్టీలతో చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.