మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టానికి అంకురార్పణ

ప్రపంచంలో అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర క్రతువుల్లో మరో ప్రధాన ఘట్టానికి బుధవారం అంకురార్పణ జరిగింది.  గత వారమే గుడిమెలిగే పండుగతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరగగా, బుధవారం ఉదయం మండమెలిగే పండగ నిర్వహిస్తున్నారు.  మాఘశుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించే ఈ మండమెలిగే పండుగతో మేడారం జాతర ప్రారంభమైనట్టేనని భావిస్తుంటారు.
మండమెలిగే పండుగ నుంచి సరిగ్గా వారం రోజులకు మాఘశుద్ధ పౌర్ణమి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. సమ్మక్క కొలువైన మేడారం, సారలమ్మ ఉన్న కన్నెపల్లి, కొండాయిలోని గోవిందరాజులు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాల శుద్ది చేస్తున్నారు.  పుట్టమట్టితో గుడులు అలికి… మామిడి తోరణాలతో అలంకరిస్తారు.
అనంతరం మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పు, డోలు వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు చేపడతారు. అక్కడి నుంచి సమ్మక్క ఆలయానికి వెళ్లి గిరిజన ఆడపడుచులు పూజలు చేస్తారు. ఆ తరువాత గ్రామంలోని బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకిస్తారు. 
మండమెలిగే పండుగ సందర్భంగా బుధవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. మేడారంలో సమ్మక్క తల్లి, కన్నెపల్లిలో సారలమ్మ, పూనుగొండ్లలో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజుల ఆలయాల్లో ఆదివాసీలు పూజలు నిర్వహిస్తారు. మండెమెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్టేనని పూజారులు చెబుతుండగా.. ఈ పూజా తంతును తిలకించేందుకు కూడా భక్తులు తరలివస్తుంటారు.
ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో మేడారం సందడిగా మారింది. ప్రకృతితో మమేకమైన గిరిజనులు ఆరాధ్య దైవాలు మేడారం సమ్మక్క- సారలమ్మ. ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగురోజుల పాటు ఈ మహా జాతర జరుగుతుంది. ఈ ఏడాది మహాజాతరను ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ నిర్వహిస్తున్నారు. 
 
ఫిబ్రవరి 21న బుధవారం  కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. అదే రోజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును మేడారం గద్దలపైకి చేర్చుతారు. 22న గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి. గద్దెపై ప్రతిష్ఠించడంతో జాతర ప్రధాన ఘట్టానికి చేరుతుంది. 23న శుక్రవారం వన దేవతలు గద్దెలపై కొలువుదీరుతారు.