కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే

కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే
 
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా, బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా ఆ ఓటు మూసీ నదిలో వేసినట్లేనని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించారు. రాహుల్ గాంధీని నమ్మి ఓట్లు వేస్తే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే అవుతుందని చెబుతూలోక్ సభ ఎన్నికల్లో వారికి ఉన్న 40 సీట్లు కూడా రావని స్పష్టం చేశారు.
 
వరంగల్ లో మంగళవారం బీజేపీ పార్లమెంట్ ఆఫీస్ను ప్రారంభిస్తూ  బీజేపీకి తెలంగాణలో డబుల్ డిజిట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఓవైసీని కూడా సవాల్ చేస్తున్నామని చెప్పారు. ఒక్క సీటు కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం ఏమీ లేదని తేల్చి చెప్పారు. దేశంలో బలమైన, సమర్థమైన నాయకత్వం ఒక్క బీజేపీ మాత్రమే ఇవ్వగలుగుతుందని తెలిపారు.

బీఆర్ఎస్పార్టీ కృష్ణా జలాలపై, కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై రచ్చ చేస్తూ లోక్ సభ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్మేడిగడ్ ప్రాజెక్టు వెడుతుంటే, కృష్ణా జలాలపై నల్గొండలో సభ పెట్టి రెండు పార్టీలు ఎన్నికల వేళ మైలేజ్ కోసం కొట్లాడుకుంటున్నాయని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, అయితే,  ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతికి పాల్పడిన మాజీ సీఎం కేసీఆర్ సీబీఐ దర్యాప్తునకు ముందుకు రాలేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

నవంబర్ 1న డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డపై ఒక ప్రాథమిక నివేదిక తయారు చేసి రాష్ట్రానికి పంపిందని, ప్రాజెక్టు సర్వే, ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ అన్నీ లోపభూయిష్ఠంగా ఉన్నాయని వెల్లడించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, మళ్లీ సందర్శనకు వస్తామన్నా అనుమతి ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. 

మేడిగడ్డ ప్రమాదంలో ఉందని తెలిసినా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల సమయం వృథా చేసిందని మండిపడ్డారు. విజిలెన్స్ దర్యాప్తు అంటున్న రాష్ట్ర సర్కారు అసలు విజిలెన్స్ ఏం చేయగలదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు.  బీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే వ్యవహరిస్తోందని చెబుతూ ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్ నల్గొండ బహిరంగ సభకు వెళ్తుండటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. 

కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు రారో ఆయనకే తెలియదని అంటూ గతంలో సచివాలయానికి వెళ్లేవారు కాదని, కేవలం సభలకు మాత్రమే కేసీఆర్‌ వెళ్తారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులపై పెత్తనం చెలాయిస్తోందని తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని చెబుతూ నాగార్జున సాగర్ డ్యామ్ పై ఏపీ పోలీసులు చేరి ముళ్ల కంచెలు వేసి తుపాకులతో ఉంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.