
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కూటమి నుంచి బయటకు వెళ్లిపోగా.. తాజాగా ఆ జాబితాలో మరో పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్డీ) చేరింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్టు ఆర్‌ఎల్డీ పార్టీ అధినేత జయంత్ చౌదరి సోమవారం ప్రకటించారు.
జయంత్ చౌదరి తాత, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఆర్‌ఎల్డీ ఎన్డీయేలో చేరనున్నదనే ప్రచారం విస్తృతంగా జరిగిన విషయం తెలిసిందే. జయంత్ చౌదరి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, అతి తక్కువ సమయంలోనే ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు.
పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో చర్చించిన తర్వాతనే ఎన్డీయేలో చేరిక నిర్ణయం తీసుకొన్నామని పేర్కొన్న జయంత్ చౌదరి దీని వెనుక ‘పెద్ద ప్లానింగ్’ ఏమీ లేదని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని అనుకొంటున్నామని తెలిపారు. ఎన్డీయేలో ఆర్‌ఎల్డీ చేరికపై పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు.
రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీకి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పట్టు ఉన్నది. రైతుల్లో బలమైన మద్దతు ఉన్నది. ఆర్‌ఎల్డీ పార్టీకి జాట్లు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. యూపీలోని దాదాపు ఏడు లోక్‌సభ స్థానాల్లో వీరి ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ యూపీలో ఆర్‌ఎల్డీకి కొన్ని సీట్లు కేటాయించడంతో పాటు ఆ పార్టీతో పొత్తు తమకు కొంతమేర లాభించే అవకాశం ఉన్నదని బీజేపీ భావిస్తున్నది.
మొదట బీజేపీతో పొత్తులో ఉన్న ఆర్‌ఎల్డీ ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌తో కూడా జట్టు కట్టింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఆర్‌ఎల్డీ ఏడు సీట్లు పోటీ చేసేలా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్‌ఎల్డీ అధినేత జయంత్ చౌదరి ప్రాథమిక అవగాహనకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తన తాజా నిర్ణయంతో జయంత్ చౌదరి అఖిలేశ్‌కు ఝలక్ ఇచ్చినట్టు అయింది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైన వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు