ఎపిలో జ‌గ‌న్ ది విధ్వంస‌క‌ర పాల‌నే

ఏపీలో విధ్వంసకర, విద్వేషపూరిత, కక్షపూరిత పరిపాలన సాగుతోందని, అందుకే ఒక్క పెట్టుబడి కూడా రాష్ట్రానికి రాలేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి  దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. కృష్ణా జిల్లా క్రోసూరు గ్రామంలో జ‌రిగిన `గావ్ చ‌లో’ కార్య‌క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ పాల్గొంటూ ప‌రిశ్ర‌మ‌లు రాక‌పోవ‌డంతో ఇక్కడ పిల్లలకు ఉపాధి లేకుండా పోయింది..

రాష్ట్రంలో, గ్రామాల్లో అంతర్గత రహదారులు బాగుండడంలేదని, కేంద్ర ప్రభుత్వం నిర్మించిన రహదారులు మాత్రమే సవ్యంగా, బ్రహ్మాండంగా ఉన్నాయని ఆమె చెప్పారు. కానీ, ఆ రోడ్లను దిగితే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఆమె ధ్వజమెత్తారు.  కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించింది అని పురందేశ్వరి ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కనీసం రోడ్ల నిర్మాణం కూడా చేయలేని దుస్థితిలో ఉందని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు టిడ్కో ఇల్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని ఆమె విమర్శించారు. నిరుద్యోగులను కూడా ప్రభుత్వం మోసం చేసిందని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో ఆక్వా రైతులను కూడా మభ్యపెట్టి విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని చెప్పి మోసం చేసిన విషయాన్ని పురందేశ్వరి గుర్తు చేశారు.

మద్యపానం నిషేధం అని చెప్పి నేడు అధిక రేట్లకు మద్యాన్ని పారిస్తున్నారని అంటూ ఆమె దుయ్యబట్టారు.  అంత‌కు ముందు ఆమె ఆ గ్రామంలో ప‌ర్య‌టించి రైతుల‌తో ఆమె కొంత సేపు మాట్లాడారు. కేంద్ర ప‌థ‌కాలు అందుతున్నాయా? అని వారిని అడిగి తెలుసుకున్నారు. మొవ్వ మండలంలోని కోసూరు, కాజ గ్రామాల్లో పల్లెకు పోదాం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. గ్రామాల్లో పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ బూత్‌ కమిటీ సమావేశంలో పాల్గొని పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన విధివిధా నాలను నాయకులు, కార్యకర్తలకు వివరించారు.