నవాజ్ షరీఫ్, బిలావర్ భుట్టో పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం!

నవాజ్ షరీఫ్, బిలావర్ భుట్టో పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం!
పాకిస్తాన్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ప్రకటించిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో చివరకు దిగివచ్చారు. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ తో పొత్తుకు అంగీకరించారు. ఇరు పార్టీల అగ్రనేతలు శుక్రవారం రాత్రి లాహోర్ లో భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు కలసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు, కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్‌ పార్టీ కూడా కూడా మిత్ర పక్షాలతో చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఇమ్రాన్‌ బలపరిచిన అభ్యర్థులు 99 సీట్లలో విజయం సాధించారు. పీఎంఎల్‌-ఎన్‌ 71, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) 53, ఇతర చిన్న పార్టీలు 27 స్థానాలను దక్కించుకున్నాయి. ఇంకా 15 సీట్లలో ఫలితం వెల్లడికావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఓటింగ్‌ ముగిసి 40 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన ప్రకటన రాలేదు.

పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనర్జీ భుట్టో కుమారుడు బిలావాల్ భుట్టో లాహోర్-ఎన్ఏ127 స్థానం నుంచి ఓడారు.  పాకిస్థాన్ ముస్లిం లీగ్‌కు చెందిన అత్తావుల్లా తారార్ చేతిలో పరాజయం చవిచూశారు. తరార్‌కు 98,210 ఓట్లు పోలవ్వగా, బిలావాల్ కేవలం 15 వేల ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.  మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కూడా ఓటమి చవిచూశారు. మన్షీరా నియోజకవర్గంలో ఆయన ఓడారు. ఆ స్థానం నుంచి పీటీఐ మద్దతుదారుడు విజయం సాధించారు. అయితే లాహోర్ ఎన్ఏ నియోజకవర్గం నుంచి మాత్రం పీటీఐ అభ్యర్థి యస్మిన్ రషీద్‌పై నవాజ్ షరీఫ్ గెలుపొందారు.

ఇదిలా ఉండగా, తమ పార్టీ అగ్రనేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఏఐ జనరేటెడ్ ప్రసంగాన్ని పీటీఐ పార్టీ విడుదల చేసింది. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించినట్లుగా ఆ వీడియోలో ఉంది. ‘మీ ఓట్ల వల్ల లండన్‌ ప్లాన్‌ విఫలమైంది. పాకిస్థానీ ప్రజలు ఆయన్ను (నవాజ్‌ షరీఫ్‌ను ఉద్దేశించి) విశ్వసించడం లేదు. మీ ఓటు శక్తిని ప్రతిఒక్కరూ చూశారు. ఇప్పుడు పోలింగ్‌ ఫలితాన్ని రక్షించుకోవాల్సి ఉంది. భారీగా నమోదైన పోలింగ్‌ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపర్చింది. ఆయన పార్టీ 30 సీట్లలో వెనకబడి ఉన్నప్పటికీ విక్టరీ ప్రసంగం చేసిన తెలివితక్కువ నాయకుడు షరీఫ్‌’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణ విజయవంతమైదంటూ ఆర్మీ చీఫ్ జనరల్‌ అసీమ్‌ మునీర్‌ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు, ప్రజాస్వామ్యం ప్రజలకు సేవ చేయడానికేనని చెప్పారు. ‘స్వప్రయోజనాలకంటే దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 25 కోట్ల మంది ప్రజల కోసం అరాచక పాలనకు దూరంగా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలి’ అని వ్యాఖ్యలు చేశారు.