కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. అందరూ ఊహించినట్లుగానే రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఉన్న 6.50 శాతం వద్దనే ఉంచాలని గురువారం జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో నిర్ణయించింది. ద్రవ్యపరపతి విధాన సమీక్షకు సంబంధించిన నిర్ణయాలను ఈ సందర్భంగా గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
దీంతో గతేడాది ఏడాది ఏప్రిల్ నుంచి ఇదే రేటుని ఆర్బీఐ కొనసాగిస్తోంది. వృద్ధికి ఊతమివ్వడం, ద్రవ్యోల్బణం ఆర్బీఐ పరిధి దాటకుండా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. రెపో రేటు విషయంలో సర్దుబాటు వైఖరిని పాటించాలని ఆరుగురు ఎంపీసీ సభ్యుల్లో ఐదుగురు అభిప్రాయపడ్డారని చెప్పారు.
విశ్లేషకుల అంచనాలను మించి భారత దేశ వృద్ధి రేటు నమోదవుతుందని ఈ సందర్భంగా శక్తికాంత దాస్ తెలిపారు. 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి స్థిరంగా ఉంటుందని అంచనా వేశారు. ధరల పెరుగుదలను నిరంతరం పరిశీలించనున్నట్టు శక్తికాంత్ దాస్ చెప్పారు. దాదాపు రెండేండ్ల నుంచి పెరుగుతూ వచ్చిన వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో గత ఏడాది ఫిబ్రవరి నుంచి రెపోరేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయడం లేదు. ఈ క్రమంలోనే ఇవాళ జరిగిన ఎంపీసీ సమీక్షలోనూ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా 2024-25 మధ్యంతర బడ్జెట్ను సమర్పించిన తర్వాత ఆర్బీఐ నిర్వహించిన తొలి ద్వైమాసిక విధాన సమావేశం ఇదే కావడం గమనార్హం. డిసెంబరులో వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం లేదా రిటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్ఠ స్థాయి 5.69 శాతంగా నమోదయ్యింది. పప్పులు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలతో సహా వివిధ ఆహార పదార్థాల ధరలు పెరుగుదల ఇందుకు ప్రధాన కారణమయ్యింది.
తాజా నిర్ణయంతో ఆర్బీఐ పాలసీ రేట్లతో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగా ఉంచడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. అయితే వడ్డీ రేట్లను ఎక్కువ రోజులు ఇలాగే కొనసాగవని.. తదుపరి రోజుల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

More Stories
షట్డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం
అక్టోబర్ లో రికార్డు స్థాయిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ
రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై దర్యాప్తు