కాంగ్రెస్‌ విడుదల చేసిన ‘బ్లాక్‌ పేపర్‌’ ఓ దిష్టిచుక్క

కాంగ్రెస్‌ విడుదల చేసిన ‘బ్లాక్‌ పేపర్‌’ను ప్రధాని నరేంద్ర మోదీ  ఓ దిష్టిచుక్కగా అభివర్ణించారు. తమ ప్రభుత్వంపై చెడుచూపు పడకుండా చూస్తుందని ప్రధాని చెప్పారు. పదేళ్ల పాలనపై కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపుతూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘బ్లాక్‌పేపర్‌’ని విడుదల చేశారు. 
 
దీంతో ప్రతిపక్షాల చర్యపై మోదీ పార్లమెంటులో విరుచుకుపడ్డారు. బ్లాక్‌పేపర్‌ని తమ ప్రభుత్వానికి దిష్టితగలకుండా చూసే దిష్టిచుక్కగా ఆయన అభివర్ణించారు. తమపై చెడు కన్ను పడకుండా చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ‘బ్లాక్‌ పేపర్‌’ను గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు.  ఆ పత్రాన్ని విడుదల చేసిన వెంటనే ప్రధాని మోదీ పదవీకాలం ముగియనున్న ఎంపీలకు వీడ్కోలు పలికేందుకు రాజ్యసభకు వెళ్లారు. సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ చర్యపై వ్యంగ్యంగా స్పందించారు. 
 
‘ఖర్గేజీ ఇక్కడ ఉన్నారు. ఓ పిల్లాడు ఏదైనా మంచి చేస్తే. ప్రత్యేక సందర్భంలో ఆ పిల్లాడికి మంచి దుస్తులు వేస్తే చెడు చూపుపడకుండా ఉండేందుకు కుటుంబంలో ఎవరైనా దిష్టి చుక్క పెడతారు. అలాగే, గత 10 ఏళ్లుగా దేశం కొత్త శ్రేయస్సు శిఖరాలను అధిరోహిస్తోంది. అందుకు మన ప్రభుత్వంపై చెడు కన్ను పడకుండా మనం సురక్షితంగా ఉండేందుకు కాలా తిక (దిష్టి చుక్క) పెట్టే ప్రయత్నం జరిగింది’ అంటూ చెప్పుకొచ్చారు. 
 
కాంగ్రెస్‌ ప్రవేశ పెట్టిన బ్లాక్‌ పేపర్‌ తమ ప్రభుత్వానికి దిష్టి చుక్క లాంటిదే అని స్పష్టం చేశారు. తమపై చెడు చూపులు పడకుండా చేస్తుందని `అంటూ  ప్రతిపక్షాల చర్యను మేం స్వాగతిస్తున్నాం. అందుకు నేను ఖర్గే జీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ మోదీ వ్యంగ్యంగా స్పందించారు.
 
కాగా, కాంగ్రెస్‌ ‘బ్లాక్‌ పేపర్‌’ విడుదల చేసిన సందర్భంగా మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్లాక్‌ పేపర్‌ని విడుదల చేస్తున్నాం. ఎందుకంటే పార్లమెంటులో మాట్లాడినప్పుడుల్లా కేంద్రం విజయాల గురించే మాట్లాడతారు. ఎప్పుడూ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడలేదు. ఆ వైఫల్యాలపై మాట్లాడడానికి మమ్మల్ని అనుమతించరు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్య. కానీ కేంద్రం ఎప్పుడూ ఈ సమస్యపై మాట్లాడలేదు.’ అని ఆయన తెలిపారు.
మన్మోహన్ సింగ్‌ను ప్రశంసించిన ప్రధాని
మరోవంక, ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రశంసించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా ప్రధాని సభలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ తన ఆరోగ్యం బాలేనప్పుడు కూడా వీల్ చైర్‌లో పని చేశారని గుర్తు చేశారు.  ఒకానొక సమయంలో ఓటింగ్ సందర్భంగా మన్మోహన్ వీల్ చైర్‌లో వచ్చి ఓటు వేశారని ఆ ఘటన వృత్తిపట్ల తనకున్న నిబద్ధతకు తార్కాణంగా నిలిచిందని పేర్కొన్నారు.భారత్ ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావించినప్పుడల్లా మన్మోహన్ సింగ్ చేసిన సేవలు గుర్తుకు వస్తాయని ప్రధాని స్పష్టం చేశారు. ఆయన ఆరుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక, దేశానికి అమూల్యమైన సేవలు అందించారని ప్రధాని ప్రశంసించారు. పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యులకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఢిల్లీలోని తన నివాసంలో గురువారం వీడ్కోలు ఇచ్చారు. ఈమేరకు ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాజ్యసభ సభ్యులు గ్రూప్ ఫొటోలు దిగారు.  సాయంత్రం 06.30కి పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం జరిగింది.