చైనా సైనికులను పరుగులు పెట్టించిన లద్దాక్ గొర్రెల కాపర్లు

వాస్తవాధీన రేఖ దగ్గర గొర్రెలను మేపకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను లడఖ్ గొర్రెల కాపరుల బృందం పరుగులు పెట్టించారు. గొర్రెల్ని మేపనివ్వకుండా తమను అడ్డుకున్న చైనా సైనికులకు స్థానిక కాపరులు ఎదురుతిరిగారు. అది భారత భూభాగమని, అక్కడ పశువుల్ని మేపుకోవడం తమ హక్కు అని తేల్చి చెప్పారు. 

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.  పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలతో వాదిస్తూ, తాము భారత భూభాగంలో ఉన్నామని చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.  గత మూడేళ్లుగా తూర్పు లడఖ్‌లోని కాపరులు ఎల్ఏఎస్ వద్ద పలు ప్రాంతాలకు తమ పశువులను మేతకు తీసుకెళ్లడం లేదు.

ఎల్ఏసీ అనేది భారత్, చైనా భూభాగాలను వేరు చేసే ఒక సరిహద్దు రేఖ. భిన్నమైన అవగాహనలు ఇరుపక్షాల సైన్యాల మధ్య వివాదాలకు దారితీశాయి.  కొన్ని సందర్భాల్లో హింసాత్మక ఘర్షణలకు కారణమవుతున్నాయి. స్థానిక గొర్రెల కాపర్ల ధైర్యాన్ని, భారత సైన్యం మద్దతును ప్రశంసిస్తూ చూషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేశారు. జనవరి ప్రారంభంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

 ‘తూర్పు లడఖ్‌ సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం ఫ్యూరీ కార్ప్స్ ద్వారా పాంగాంగ్ ఉత్తర ఒడ్డున ఉన్న సంప్రదాయ మేత మైదానాల్లో తమ హక్కులను సాధించుకోవడానికి, సంచార జాతులకు అనుకూలమైన వాతావరణం చూడటం సంతోషంగా ఉంది. ఇంతటి బలమైన పౌర- సైనిక సంబంధాలు, సరిహద్దు ప్రాంత జనాభా ప్రయోజనాలను పరిరక్షించినందుకు నేను భారత సైన్యానికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.