కశ్మీర్‌లో 70 శాతం తగ్గిన ఉగ్రవాద చర్యలు

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఇంతకు ముందటితో పోలిస్తే ఆర్టికల్ ఎత్తివేత తరువాత దాదాపు 70 శాతం వరకూ ఉగ్రవాద చర్యల ఉదంతాలు తగ్గుతూ వచ్చాయని, ఈ క్రమంలో ఈ పరిణామం జమ్మూ కశ్మీర్‌లో వినూత్న శాంతి అధ్యాయానికి దారితీసిందని పేర్కొన్నారు.

అమిత్ షా గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌మ్ములో ఈ-బ‌స్ స‌ర్వీస్‌ను ప్రారంభించ‌డంతో పాటు వేయి మందికిపైగా జ‌మ్ము క‌శ్మీర్ ఉమ్మ‌డి ప‌రీక్ష 2024లో నెగ్గిన వారికి నియామ‌క ప‌త్రాలు అంద‌చేశారు. జ‌మ్ము క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అనంత‌రం పౌరుల మ‌ర‌ణాలు 81 శాతం త‌గ్గ‌గా, భ‌ద్ర‌తా ద‌ళాల మ‌ర‌ణాలు 48 శాతం త‌గ్గాయ‌ని అమిత్ షా ఈ సందర్భంగా తెలిపారు. 

2010లో రాళ్లు రువ్విన ఘ‌ట‌న‌లు 2654 చోటుచేసుకోగా 2023లో అవి పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యాయ‌ని చెప్పారు. 2010లో 132 స‌మ్మె ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌గా, 2023లో అలాంటి ఘ‌ట‌న ఒక్క‌టి కూడా లేద‌ని తెలిపారు. 2010లో రాళ్ల దాడుల్లో 112 మంది పౌరులు మ‌ర‌ణిస్తే 2023లో ఒక్క‌రూ కూడా చ‌నిపోలేద‌ని చెప్పారు.

 2010లో రాళ్ల దాడుల ఘ‌ట‌న‌ల్లో 6235 మందికి గాయాలు కాగా 2023లో అలాంటి ఘ‌ట‌న ఒక్క‌టి కూడా చోటుచేసుకోలేద‌ని మంత్రి వివ‌రించారు. ఇంతకు ముందటి వరకూ టెర్రరిస్టు హబ్‌గా పేరొందిన జమ్మూ కశ్మీర్ ఇప్పుడు టూరిస్టు హబ్ అవుతోందని, ఈ కీలక పరిణామానికి ప్రతిష్ట అంతా ప్రధాని మోదీ నాయకత్వానికి, ఆయన కార్యదక్షతకు దక్కుతుందని అమిత్ షా కొనియాడారు.

హోం మంత్రి ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వంద ఇ బస్సులకు పచ్చజెండా చూపి ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రవాదపు మరకల నుంచి బయటపడటం గణనీయ పరిణామం అని చెప్పారు.