ఆకట్టుకున్న మహిళా సైనికుల ‘నారీ శక్తి’ విన్యాసాలు

ఆకట్టుకున్న మహిళా సైనికుల ‘నారీ శక్తి’ విన్యాసాలు
* ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
 
దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఉదయాన్నే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముర్ముతో కలిసి మాక్రాన్ సంప్రదాయ గుర్రపు బగ్గీలో వేదిక వద్దకు వచ్చారు.

దాదాపు 38 ఏళ్ల తరువాత గణతంత్ర వేడుకల్లో బగ్గీని వినియోగించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు  తదితరులు హాజరయ్యారు. ఉదయాన్నే జాతీయ వార్ మెమోరియల్‌ను ప్రధాని సందర్శించడం, నివాళులర్పించడంతో గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి.

కర్తవ్యపథ్‌కు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగిన పరేడ్‌, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మొత్తం 15 వందల మంది మహిళా, పురుష కళాకారులు ఈ సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 

ఈ ప్రదర్శనలు దేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచాయి. ఈ సారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. పరేడ్‌ ‘ఆవాహన్‌’తో మొదలైంది. ఆవాహన్‌లో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన చేశారు.

మొత్తం మహిళలతో కూడిన ట్రై సర్వీస్‌ బృందం కర్తవ్య మార్గ్‌లో కవాతు చేయడం ఇదే మొదటిసారి. నారీ శక్తి పేరుతో మహిళా పైలెట్లు, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సిఎపిఎఫ్‌) మహిళా సిబ్బంది ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు ప్రదర్శించిన శకటాలను ప్రదర్శించారు. 

అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తూ భారత్‌ సాధించిన చంద్రయాన్‌ 3 విజయం నుంచి మొదలుకుని ఇటీవలె ప్రారంభోత్సవం జరుపుకున్న అయోధ్య రామ మందిరంలో కొలువైన బాలక్ రాముడి వరకు అనేక విషయాలను తెలియజేసేలా ఉన్న శకటాలు సందర్శకుల మనసులను హత్తుకున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన శకటాలు కూడా ఉన్నాయి.

ఈ రిపబ్లిక్ డే పరేడ్‌లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో ప్రదర్శించిన శకటంలో చంద్రయాన్‌ 3, ఆదిత్య ఎల్‌ 1 ప్రయోగాలకు చెందిన శకటాలు ఆకట్టుకున్నాయి. చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్ దిగుతున్న దృశ్యాలను ఆ శకటంలో చూపించారు. శకటంపై ఉన్న మహిళా శాస్త్రవేత్తలు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ దిగిన శివశక్తి పాయింట్‌ను చూపిస్తున్నట్లు ఉన్న ఆ శకటం కనువిందు చేసింది.

ఇక నాలుగు ఎంఐ-17వి హెలికాప్టర్లు ధ్వజ్‌ ఆకృతిలో విన్యాసాలు ప్రదర్శించాయి. ఈసారి పరేడ్‌లో 90 మంది సభ్యుల ఫ్రాన్స్‌ దళం కూడా పాల్గొంది. ఫ్రెంచ్‌ దళం ప్రదర్శన సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు గగనతలంలో విన్యాసాలు చేశాయి.

మహిళా అధికారులు దీప్తి రాణా, ప్రియాంకా సేవ్‌దా.. ఆయుధ లొకేషన్‌ గుర్తింపు రాడార్‌, పినాక రాకెట్‌ వ్యవస్థలకు నేతృత్వం వహించారు. చరిత్రలో తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు పాల్గొన్నాయి. ఇందులో అగ్నివీర్‌లు కూడా ఉన్నారు.  ఆత్మనిర్భరత, నారీశక్తి థీమ్‌తో నౌకాదళ శకటం ఆకట్టుకుంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌తో పాటు, శివాళిక్‌, కలవరి క్లాస్‌ సబ్‌మెరైన్లను ప్రదర్శించారు. 

దేశీయంగా తయారుచేసిన ఆయుధాలతో పాటు క్షిపణులు, డ్రోన్‌ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, బీఎంపీ-2 సాయుధ శకటాలను ప్రదర్శించారు. ఎయిర్‌ఫోర్స్‌ మార్చ్‌కు స్క్వాడ్రన్‌ లీడర్లు రష్మీ ఠాకుర్‌, సుమితా యాదవ్‌, ప్రతిథి అహ్లువాలియా, ఫ్లైట్ లెఫ్టినెంట్‌ కిరిట్‌ రొహైల్‌ నేతృత్వం వహించారు. 

260 మంది సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ మహిళా సైనికులు ‘నారీ శక్తి’ పేరుతో విన్యాసాలు చేశారు. తొలిసారి బీఎస్‌ఎఫ్‌ మహిళా బ్రాస్‌ బ్యాండ్‌ ఈ పరేడ్‌లో పాల్గొంది. 300 ఏళ్ల బాంబే శాపర్స్‌ రెజిమెంట్‌ చరిత్రలో తొలిసారిగా అందరూ పురుషులే ఉన్న బృందానికి ఒక మహిళ నాయకత్వం వహించారు. 31 ఏళ్ల మేజర్‌ దివ్య త్యాగికి ఈ అవకాశం దక్కింది.

ఈ ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అందుకున్న 19 మంది పరేడ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ శకటాలున్నాయి. వీటితోపాటు సామాజిక-ఆర్థిక కార్యకలాపాలు, శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన మహిళలు ప్రదర్శించిన 10 శకటాలు ఆకట్టుకున్నాయి.