2030 నాటికి ఫ్రాన్స్ కు 30 వేల మంది భారతీయ విద్యార్థులు

రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుకునే దిశగా చర్యలు తీసుకుంటామని ఫ్రాన్స్‌  అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌  మాక్రాన్ వెల్లడించారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తద్వారా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాక్రాన్ తన పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్’ చొరవతో విశ్వవిద్యాలయాల్లో ఫ్రెంచ్ నేర్చుకోవడానికి ఒక నెట్‌వర్క్‌ను సృష్టిస్తామని వివరించారు. 
 
ఫ్రెంచ్‌ మాట్లాడలేని విద్యార్థుల కోసం అంతర్జాతీయ తరగతులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఫ్రాన్స్‌లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని ఈ సందర్భంగా మాక్రాన్‌ వెల్లడించారు. ఇక 2025నాటికి 20 వేల మంది విద్యార్థులను ఫ్రాన్స్‌కి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
 
గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రపతి, ప్రధాని మోదీతో కలిసి మాక్రాన్‌ వీక్షించారు.. ఈ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఫ్రాన్స్‌ దళం కూడా పాల్గొంది. మొత్తం 90 మంది సభ్యులతో కూడి ఫ్రెంచ్‌ దళం ప్రదర్శన ఇచ్చింది. ఆ సమయంలో రఫేల్‌ యుద్ధ విమానాలు గగనతలంలో విన్యాసాలు చేశాయి. 
 
ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా షేర్‌ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ దేశానికి దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.