త్వరలో బ్రహ్మోస్‌ మిస్సైల్స్‌ ఎగుమతి

రక్షణ రంగంలో స్వావలంభన దిశగా ఎదుగుతున్న భారత్‌ మరో ఘనతను సొంతం చేసుకోబోతున్నది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఈ ఏడాది మార్చి నాటికి మొదటి సారిగా బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఫిలిప్పీన్స్‌ కు ఎగుమతి చేయనున్నది. ఈ విషయాన్ని డీఆర్డీవో చీఫ్‌ సమీర్‌ వీ కామత్‌ ధ్రువీకరించారు.

డీఆర్డీవో రాబోయే పది రోజుల్లో పది రోజుల్లో క్షిపణుల గ్రౌండ్ సిస్టమ్‌లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. అంతే కాకుండా డీఆర్డీవో అభివృద్ధి చేసిన, భారత్ ఫోర్జ్‌, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తదితర ప్రైవేట్ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఏటీఏజీఎస్‌ 307 గన్స్‌కు విదేశాల నుంచి ఆర్డర్లు ఈ ఆర్థిక సంవత్సరం నాటికి రావచ్చని పేర్కొన్నారు.

ఇప్పటివరకు భారత్ మరే విదేశంకు కూడా చేయని భారీ రక్షణ పరికరాల ఎగుమతిగా ఫిలిప్పీన్స్‌కు ఈ క్షిపణుల ఎగుమతి కానున్నాయి.  జనవరి 2022లో ఆ దేశానికి 375 మిల్లియన్ డాలర్ల క్షిపణుల ఎగుమతికి భారత్ ఒప్పందం చేసుకుంది.

ఫిలిప్పీన్స్‌తో పాటు పలు దేశాలు బ్రహ్మోస్ క్షిపణిపై ఆసక్తి చూపుతున్నాయని డీఆర్డీవో చీఫ్‌ తెలిపారు. ఎగుమతికి సిద్ధంగా ఉన్న ఏటీఏజీఎస్ గన్స్‌ ట్రయల్స్ అన్నీ పూర్తయ్యాయని తెలిపారు. వాటికి మార్చి 31 వరకు ఆర్డర్‌ వస్తుందని ఆయన అంచనా వేశారు. 

ఇప్పటి వరకు డీఆర్డీవో ఉత్పత్తి చేస్తున్న ఆయుధాలను త్వరలో సైన్యంలోని మూడు విభాగాల్లో చేరనున్నాయని ఆయన వెల్లడించారు. ఎల్‌సీఏ ఎంకే-1ఏ, అర్జున్‌ ఎంకే-1ఏ, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ తదితర క్షిపణులు త్వరలోనే సైన్యంలో భాగమవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు  రూ. 3.75 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను డీఆర్డీవో డి భారత సైన్యంకు అందించడం గాని, అందించేందుకు అంగీకారం తెలపడం గాని జరిగినట్లు ఆయన వెల్లడించారు.