రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులతో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌

రెరా కార్యదర్శి, గతంలో హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన శివబాలకృష్ణను  ఏసీబీ అరెస్టు చేసింది. బుధవారం ఉదయం నుంచి శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. 
 
రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించిన అధికారులు లాకర్లు తెలిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బినామీల పేరుతో వందల కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే వారిని విచారించి కీలక వివరాలు సేకరించారు. ఆయనపై బినామీ చట్టం ప్రయోగించే యోచనలో ఉన్నారు.
 
మణికొండలోని ఆదిత్యపోర్ట్‌ వ్యూలో విల్లా నంబర్‌ 25లో శివబాలకృష్ణ నివాసం ఉంటున్నారు. 2018 నుంచి 2023 వరకు హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన, ఆరు నెలల క్రితం రెరా (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ ఆథారిటీ) కార్యదర్శిగా బదిలీ అయ్యారు. మెట్రోరైల్‌ ప్లానింగ్‌ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల సోదాలు చేశారు. గురువారం కూడా సోదాలు కొనసాగే అవకాశముంది. మణికొండలోని ఆయన నివాస గృహంలో, అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో కూడా తనిఖీలు చేశారు. 2018-2023 కాలంలో హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన శివబాలకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారా కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
వాటిపై తాజా ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సుధీంద్ర ఆధ్వర్యంలో మణికొండలోని ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి, పదికి పైగా ఐఫోన్లు.. అత్యంత ఖరీదైన 50 వాచీలు, కట్టలు కట్టలుగా నగదు, ఆయన బీరువాలో 5 కిలోల బంగారు నగలు, 70 ఎకరాలకు సంబంధించిన భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
 
శివబాలకృష్ణ ఇంట్లో రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపిన అధికారులు ఆయన ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.20 కోట్లకు పైగానే ఉంటుందని వెల్లడించారు. గత ప్రభుత్వ హయంలో చక్రం తిప్పిన శివబాలకృష్ణ.. మునిసిపల్‌ శాఖలో ప్లానింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతూనే హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ పోస్టు పొందారు. మున్సిపల్‌ శాఖలో డైరెక్టర్‌ ఐదారేళ్లకు పైగా, హెచ్‌ఎండీఏలో డైరెక్టర్‌గా రెండు విడతలుగా సుమారు ఎనిమిదేళ్ల పాటు కొనసాగారు. 
 
సుమారు ఐదేళ్ల పాటు ఏకకాలంలో జోడు పదవుల్లో కొనసాగారు. మాసాబ్‌ట్యాంక్‌ ప్రాంతంలోని అఫీసులో రాత్రుళ్లు సైతం డెవలపర్లతో భేటీలు జరుపుతూ అక్రమంగా అనుమతులిచ్చి లబ్ధి పొందారనే ఆరోపణలున్నాయి. మాజీమంత్రి వ్యవహారాలు చక్కబెడుతూ కోట్లకు పడగలెత్తిన విషయాన్ని గుర్తించినందునే ప్రస్తుత ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖను రంగంలోకి దింపిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.