రామేశ్వరం నుంచి శ్రీలంకకు కొత్తగా మరో ‘రామసేతు’

రామేశ్వరం నుంచి శ్రీలంకకు కొత్తగా మరో ‘రామసేతు’
దేశంలో పర్యాటక రంగాన్ని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా భారత్‌-శ్రీలంకల మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తున్నది.  భారత్‌లోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌ను కలిపేలా ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నది.  సముద్రంపై 23 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 
త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామేశ్వరం నుంచి శ్రీలంక మధ్య రామసేతు వారధి ఉన్న విషయం తెలిసిందే.  కొత్త రామసేతు, ధనుష్కోడి, తలైమన్నార్‌- శ్రీలంక పాల్క్‌ జలసంధిని కలుపుతూ 23 కిలోమీటర్ల పొడువున రోడ్డు, రైలు మార్గం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
రూ.40వేల కోట్లతో రామసేతు ప్రాజెక్టును కేంద్రంలోని త్వరలో ప్రారంభించడానికి సాధ్యాసాధ్యాలపై ఎన్‌హెచ్‌ఏఐ ద్వారా అధ్యయనం చేయనున్నది.  2022 జులైలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే ఢిల్లీలో పర్యటించిన సందర్భంగా ట్రింకోమలి, కొలంబో ఓడరేవుల అభివృద్ధి చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి భారతదేశం, శ్రీలంక అంగీకరించాయి. ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై చర్చించింది. 
 
ఈ సమయంలోనే విదేశాంగ మంత్రిత్వ శాఖ వంతెన సాధ్యాసాధ్యాల అధ్యయనానికి సంబంధించి నివేదిక తయారు చేయాలని చెప్పింది. వంతెన ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడుతాయని భావిస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు సాంకేతికత, ఆర్థిక, పర్యావరణం తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. 
 
డిసెంబర్‌ 2015లో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విక్రమసింఘేతో రోడ్డు, రైలు వంతెనలను నిర్మించే ప్రణాళికపై చర్చించారు.  ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తమిళనాడులో పర్యటించిన సందర్భంగా ధనుష్కోడిని సైతం సందర్శించారు. 
 
కోదండ రామస్వామి ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు. ధనుష్కోడి సమీపంలో ఉన్న అరిచల్‌ మునైని సైతం సందర్శించారు. తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. రామేశ్వరంలోని అగ్నితీర్థం బీచ్ వద్ద సముద్రంలో స్నానమాచరించిన ప్రధాని, రామనాథస్వామి ఆలయంలో పూజలు చేశారు.