బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న

బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న
బీహార్ మాజీ ముఖ్యమంత్రి  కర్పూరి ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు ప్రకటించింది. 1977-79 మధ్య కాలంలో బీహార్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఓబీసీ నాయకుడిగా ఆయనకు జన నాయక్ అనే పేరు కూడా ఉండేది. ఆయన శత జయంతి సందర్భంగా కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న అవార్డు ప్రకటించారు
 
సోషలిస్టు పార్టీ, భారతీయ క్రాంతి దళ్ పార్టీల తరఫున 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకూ బీహార్ సీఎంగా పని చేశారు. తిరిగి 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకూ సీఎంగా ఉన్నారు.  “శ్రీ కర్పూరీ ఠాకూర్‌కు (మరణానంతరం) భారతరత్న ప్రదానం చేయడం పట్ల రాష్ట్రపతి సంతోషిస్తున్నారు” అని రాష్ట్రపతి సెక్రటేరియట్ నుండి ఒక ప్రకటన తెలిపింది.
 
సోషలిస్ట్ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన ఠాకూర్ బీహార్‌లోని వెనుకబడిన తరగతుల కోసం పోరాడినందుకు ప్రసిద్ధి చెందారు. ‘జన నాయక్’గా ప్రసిద్ధి చెందిన ఆయన రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. డిసెంబర్ 1970 నుండి జూన్ 1971 వరకు, డిసెంబర్ 1977 నుండి ఏప్రిల్ 1979 వరకు పనిచేశారు.  అంతకు ముందు డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు.  అట్టడుగు వర్గాలకు ఒక ఛాంపియన్‌గా, సమానత్వం, సాధికారత కోసం ఆయన చేసిన నిరంతర కృషికి ఈ అవార్డు నిదర్శనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రభుత్వ నిర్ణయాన్ని కొనియాడారు.
 
“సామాజిక న్యాయం, గొప్ప జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ జీకి భారతరత్న ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించినందుకు నేను సంతోషిస్తున్నాను.  అది కూడా మేము ఆయన సత్తా జయంతిని జరుపుకుంటున్న తరుణంలో ఇవ్వడం సంతోషకరం” అని మోదీ X లో రాశారు.
 
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఠాకూర్‌కు ఉన్న తిరుగులేని నిబద్ధత, ఆయన దార్శనిక నాయకత్వం భారతదేశ సామాజిక, రాజకీయ నిర్మాణంపై చెరగని ముద్ర వేశాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ‘ఈ అవార్డు ఆయన అందించిన విశేషమైన సేవలను గౌరవించడమే కాకుండా మరింత న్యాయమైన,  సమానమైన సమాజాన్ని సృష్టించే ఆయన మిషన్‌ను కొనసాగించడానికి మాకు స్ఫూర్తినిస్తుంది” అని ఆయన తెలిపారు.
 
1924 జనవరి 24న సమస్తిపూర్ లో నాయీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కర్పూరీ థాకూర్ టీచర్‌గా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1952లో తాజ్‌పూర్ నియోజకవర్గం నుంచి సోషలిస్ట్ పార్టీ తరఫున తొలిసారి విధాన సభకు ఎన్నికయ్యారు. ఉద్యోగులు, కార్మికుల తరఫున ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.
 
 బిహార్‌లో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. సోషలిస్టు పార్టీ తొలి సీఎం కూడా ఆయనే కావడం విశేషం. 1968లో ఉపముఖ్యమంత్రిగా అయి, 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు సోషలిస్ట్ పార్టీ/భారతీయ క్రాంతి దళ్ తరఫున ఆయన సీఎంగా పని చేశారు. మళ్లీ 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు జనతా పార్టీ తరఫున ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
 
కర్పూరీ థాకూర్ సీఎంగా ఉన్న సమయంలో బిహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు. ఆయన హయాంలో బిహార్లో అనేక స్కూళ్లు, కాలేజీలను స్థాపించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఆయన పేదల పాలిట పెన్నిధిగా గుర్తింపు పొందారు. కర్పూరీ థాకూర్ విద్యాశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో మెట్రిక్యూలేషన్ స్థాయిలో ఇంగ్లిష్ సబ్జెక్ట్ తప్పనిసరనే నిబంధనను తొలగించారు.

బిహార్‌లో ప్రముఖ నేతలైన లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, నితీశ్ కుమార్, దేవేంద్ర ప్రసాద్ యాదవ్ తదితరులకు కర్పూరీ థాకూర్ మార్గదర్శిగా వ్యవహరించారు. 1988 ఫిబ్రవరి 17న 64 ఏళ్ల వయసులో కర్పూరీ థాకూర్ కన్నుమూశారు. ఆయన పేరిట పోస్టల్ స్టాంపులను విడుదల చేయడంతోపాటు,  జన్ నాయక్ పేరిట దర్భంగా, అమృత్ సర్ మధ్య రైలును నడుపుతున్నారు.
 
బిహారీలైన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఇంతకు ముందు భారత రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. 1992లో మరణానంతరం భారతరత్న పురస్కారానికి ఎంపికైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ సైతం బిహార్ మూలాలున్న నాయకుడే.