ప్రాణ ప్రతిష్ట వేడుకలో కాంగ్రెస్ మంత్రి విక్ర‌మాదిత్య సింగ్‌

అయోధ్య‌లో నూత‌నంగా నిర్మించిన రామాల‌యంలో శ్రీరాముడి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి ఆహ్వానాన్ని కాంగ్రెస్ నిరాక‌రించిన క్ర‌మంలో ఆ పార్టీ నేత‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మంత్రి విక్ర‌మాదిత్య సింగ్ మాత్రం ఆల‌య ప్రారంభోత్స‌వ వేడుకకు హాజరయ్యారు. అయోధ్య‌కు చేరుకున్న హిమాచ‌ల్ ప్ర‌జాప‌నుల శాఖ మంత్రి విక్ర‌మాదిత్య సింగ్ రాముడి ప్రాణ ప్ర‌తిష్ట వేడుక‌లో పాలుపంచుకున్నారు. 
 
రామ మందిర ప్రారంభోత్స‌వ వేడుక‌ను పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులంద‌రికీ సగం రోజు ప్ర‌క‌టించిన ఒకే ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కావ‌డం గ‌మ‌నార్హం.  ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని అందిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. అయోధ్య రామాల‌య ప్రారంభోత్స‌వ వేడుక ఆరెస్సెస్‌, బీజేపీ కార్యక్ర‌మమ‌ని అభివ‌ర్ణిస్తూ ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ అగ్ర నేత‌లు దూరంగా ఉన్నారు. 
 
మ‌రోవైపు అయోధ్య‌లో బాల‌రాముడు కొలువైన వేళ క‌ర్నాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము (కాంగ్రెస్‌) గాంధీ కొలిచిన రాముడిని పూజిస్తామ‌ని, బీజేపీ రాముడిని కాద‌ని పేర్కొన్నారు. సీత, లక్ష్మ‌ణుడి నుంచి శ్రీరాముడిని వేరు చేసేందుకు కాషాయ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని సిద్ద‌రామ‌య్య విమ‌ర్శించారు. 
 
సీతా, ల‌క్ష్మాణుడు లేకుంటే రాముడు లేడ‌ని, రాముడు స‌ర్వాంత‌ర్యామి అని అయోధ్య‌కే ప‌రిమితం కాడ‌ని వ్యాఖ్యానించారు. రాముడి ఉనికి ఆయ‌న ఆల‌యం కంటే విస్తృతంగా ఉంటుంద‌ని మ‌హ‌దేవ్‌పుర జిల్లాలో రామ‌, సీత‌, ల‌క్ష్మ‌ణ్‌, హ‌నుమాన్ విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించిన అనంత‌రం సిద్ధ‌రామ‌య్య మాట్లాడారు. తాను ఒక‌రోజు అయోధ్య‌ను సంద‌ర్శిస్తాన‌ని సిద్ధ‌రామ‌య్య పేర్కొన్నారు. శ్రీరాముడు ప్ర‌తి ఒక్క‌రికీ భ‌గ‌వంతుడ‌ని, ఆయ‌న బీజేపీ దేవుడు కాద‌ని, హిందువులంద‌రి దేవుడ‌ని స్ప‌ష్టం చేశారు.