అంగన్‌వాడీల దీక్ష భగ్నం.. వందలాది మంది అరెస్ట్

అంగన్‌వాడీల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. జగనన్నకు తమగోడు చెప్పుకుంటామంటూ కోటి సంతకాలతో విజయవాడ చేరుకున్న అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలను అర్థరాత్రి సమయంలో అరెస్టులు చేశారు. ఐదు రోజులుగా జరుగుతున్న నిరాహారదీక్షా శిబిరాన్ని పోలీసులు కూల్చివేశారు. 
 
ఈ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న వీధిలైట్లను సైతం నిలిపేయించారు. టెంట్లు పీకేశారు. కుర్చీలు బయటకు విసిరేశారు. చీకటిలో మగ పోలీసులు మహిళలపట్ల ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. చీరలు లాగుతూ, మహిళలని కూడా చూడకుండా నానా దుర్బాషలాడుతూ, తిడుతూ అరెస్టులకు పాల్పడ్డారు. అర్థరాత్రి ఒక్కసారిగా వందలమంది పోలీసులు వచ్చిపడటంతో ఏమి చేయాలో తెలియక మహిళలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
 
  అంగన్‌ వాడీల ఆందోళనకు అనుమతి లేదని ప్రకటించిన పోలీసులు అర్ధరాత్రి అరెస్టులకు దిగారు. విజయవాడ అలంకార్ థియేటర్‌ సమీపంలో ఉన్న ధర్నా చౌక్ వద్ద అర్ధరాత్రి 3 గంటల సమయంలో అంగన్వాడీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. వందలాది మంది మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు.
 
గతంలో ఎన్నడూ లేని విధంగా ఫోటోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. మరోవైపు పోలీసులు అరుపులు కేకలతో ఆ ప్రాంతం తీవ్ర భయానకంగా మారింది. తొలుత ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పలువురు మహిళలు పోలీసులను అడ్డుకున్నారు. 
 
వేకువజామున 3.05 గంటలకు ప్రారంభించిన అరెస్టులు 4.15 గంటలకు పూర్తిచేసినట్లు అక్కడ విశాల్‌ గున్నీ ప్రకటించారు. అనంతరం వేర్వేరు జిల్లాల నుండి విజయవాడ చేరుకున్న వారిని పోలీసులు బలవంతంగా బస్సుల్లో ఎక్కించి పంపిచేస్తున్నారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరామని, 42 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి దీక్ష శిబిరంపై వందలాది మంది పోలీసులుతో దాడి చేయించారని పేర్కొంటూ నిద్ర పోతున్న వారిని లేపి అరెస్టులు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా అక్క చెల్లెమ్మలు అనే జగన్ అంగన్‌వాడీలపై పోలీసులతో దాడి చేయిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇటువంటి అరెస్టులకు బెదిరేది లేదని, సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

తమను ఉద్యోగాల్లోంచి ప్రభుత్వం తీసేస్తుందో, ప్రభుత్వాన్ని తాము గద్దె దించుతామో మూడు నెలల్లో తేలిపోతుందని అరెస్టైన అంగన్‌ వాడీలు అక్రోశం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్నా కూడా అర్థరాత్రి అరెస్ట్ చేశారని ఆరోపించారు.