అయోధ్య రామయ్యకు 21.6 అడుగుల భారీ వేణువు

అయోధ్య రామయ్యకు 21.6 అడుగుల భారీ వేణువు

రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఎవరికి ఎవరు తమకు తోచిన కానుకలను అయోధ్య నగరానికి పంపుతున్నారు. ఈ క్రమంలోనే 21.6 అడుగుల పొడువున్న వేణువును ఫిలిబిత్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం కానుకగా ఇవ్వనున్నది. ఈ భారీ వేణువును ఫిలిబిత్‌ నుంచి అయోధ్యకు తరలించనున్నారు.

ఈ వేణువును ఫిలిబిత్‌కు చెందిన ప్రముఖ హస్తకళాకారుడు నవాబ్‌ అహ్మద్‌ భార్య హీనా ఫర్వీన్‌, అతని కొడుకు అర్మాన్‌ నబీ, అతని స్నేహితులతో కలిసి తయారు చేయగా.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన హరీశ్‌ రౌతేలా ఆ వేణువుకు పూజలు చేశారు. ఈ నెల 26న అయోధ్య ధామ్‌కు పంపనున్నారు. 

2021లో 16 అడుగుల పొడవైన వేణువును తయారు చేయగా ఈ వేణువు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నది. తాజాగా 21.6 అడుగుల వేణువును తయారు చేశాడు. ఇదే ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా నిలువనున్నది. అర్మాన్‌ కుటుంబం వేణువులను తయారు చేస్తూ ఉంటుంది. 

ఈ వేణువును అసోంకు చెందిన వెదురుకర్రతో తయారుచేసినట్లు చెప్పారు. 20 సంవత్సరాల కిందట ఈ వెదురుకర్రను సేకరించిన పెట్టామని, అయోధ్య రామయ్యకు కానుకగా ఉపయోగపడుతుందని అనుకోలేదని సదరు కుటుంబం తెలిపింది. ఈ వెదురు ప్రత్యేకత ఏమిటంటే వేణువు వ్యాసం 3.5 అంగుళాలు ఉంటుంది. 

గుండ్రని వెదురు ప్రస్తుతం అందుబాటులో లేదు. వేణువు తయారు చేయడానికి పది రోజులు సమయం పట్టింది. ప్రత్యేకత ఏమిటంటే దాన్ని రెండు వైపులా ఈ వేణువుతో గానం చేయవచ్చు. ఈ భారీ వేణువు తయారీకి దాదాపు రూ.70-80 వేలు ఖర్చయింది. ప్రస్తుతం ఈ వేణువు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యేకంగా ట్రక్కులో అయోధ్య ధామ్‌కు తరలించనుండగా, మ్యూజియంలో భద్రపరచనున్నారు.

రామ మందిరం డిజైన్ తో నెక్లెస్

మరోవంక,  రామ మందిరం డిజైన్ తో, వెండి, వజ్రాలతో చేసిన నెక్లెస్ ను సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి తయారు చేయించారు. 5000 అమెరికన్ వజ్రాలు, 2 కిలోల వెండితో రామాలయం థీమ్ తో ఈ నెక్లెస్ ను తయారు చేశారు. 35 రోజుల్లో 40 మంది కళాకారులు ఈ డిజైన్ ను పూర్తి చేశారు. ఈ నెక్లెస్ ను వాణిజ్య ప్రయోజనం కోసం రూపొందించలేదని, రామ మందిరానికి బహుమతిగా ఇవ్వాలన్న ఉద్దేశంతో తయారు చేశామని సూరత్ కు చెందిన రాసేశ్ జ్యువెల్స్ డైరెక్టర్ కౌశిక్ కకాడియా తెలిపారు.

అయోధ్య రామాలయానికి అందిన మరో కానుక శ్రీరామాలయాన్ని ప్రతిబింబించే సిల్క్ బెడ్ షీట్. ఈ బెడ్ షీట్ ను తమిళనాడుకు చెందిన ఓ సిల్క్ తయారీదారు రూపొందించారు. సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన స్వచ్ఛమైన కుంకుమపువ్వు, ఆఫ్ఘనిస్తాన్ నుండి కుభా (కాబూల్) నది నీరు కూడా అయోధ్య రాముడికి కానుకలుగా అందాయి.