తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ను అభినందించిన ఇంటర్‌పోల్‌

తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్టేషన్‌ను ఇంటర్‌పోల్‌ అభినందించింది. ఈ మేరకు టీడీసీఏకు ఇంటర్‌ పోల్‌ శనివారం లేఖ రాసింది. నకిలీ మందులు వ్యాధిని నయం చేయడంలో విఫలం చెందడమేకాకుండా ప్రజారోగ్యానికి పెనుముప్పును కులగజేస్తాయని పేర్కొంది. డీసీఏ అధికారులు మార్కెట్‌లో నకిలీ డ్రగ్స్‌ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నారని ప్రశంసించింది.

తెలంగాణను నకిలీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు టీడీసీఏ ప్రయత్నాలు చేస్తుందని చెప్పింది. సన్‌, గ్లెన్‌మార్క్‌ అరిస్‌టోర్మికల్ ఫార్మాలకు చెందిన కంపెనీల పేర్లతో నకిలీ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న డ్రగ్స్‌ ముఠాగుట్టను బట్టబయలు చేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.  నకిలీ యాంటీబయాటిక్స్, హైపర్‌ టెన్షన్, కొలెస్ట్రాల్ మందులను స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది.

ఇదిలా ఉండగా,డిసెంబర్‌లో ఉత్తరాఖండ్‌ కాశీపూర్‌ నుంచి కొరియర్‌ ద్వారా హైదరాబాద్‌కు వచ్చిన రూ.26లక్షల విలువైన నకిలీ మందులను డీసీఏ స్వాధీనం చేసుకుంది. ఈ నెల 3న డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి కొరియర్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన నకిలీ యాంటీబయాటిక్స్ మెడిసిన్ రాకెట్‌ గుట్టును రట్టు చేసింది. హైదరాబాద్‌ నగర పరిధిలోని ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన దాడుల్లో రూ.22.95 లక్షలు మందులను పట్టుకున్నది.

కోట్లాదిమంది ప్రజల ఆరోగ్యానికి హానిచేస్తున్న నకిలీ మందులను ఉత్పత్తి స్థాయిలోనే అరికట్టడం కోసం ఇంటర్‌ పోల్‌ ప్రపంచంలోని అతిపెద్ద 29 ఔషధ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా నకిలీ మందులను వ్యాపింప చేస్తున్న ఔషధ కంపెనీల నేరాలను కట్టడి చేసేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నది.