జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించిన ఈడీ

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించిన ఈడీ
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులు శనివారం ఉదయం రాంచీలోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి హేమంత్ సోరెన్‌ను ఆయన ఇంటిలో విచారణ జరిపారు. 
 
ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. జార్ఖండ్‌లో భూమి యాజమాన్యాన్ని అక్రమంగా మార్చే భారీ మాఫియాకు సంబంధించిన స్కామ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 14 మందిని ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. 2011 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, రాంచీ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన రంజన్‌ను కూడా ఈ కేసులో అరెస్ట్‌ చేశారు.
 
కాగా, భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ ఇప్పటికే ఏడుసార్లు సమన్లు జారీ చేసింది. ఈ నెలలో జారీ చేసిన చివరి సమన్లకు కూడా ఆయన స్పందించలేదు. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే అన్ని పత్రాలను ఈడీకి పంపినట్లు ఆయన తెలిపారు.
 
జనవరి 16 – 20 మధ్య ఈ కేసు విచారణకు అందుబాటులో ఉండాలని సోరెన్‌ను కోరుతూ దర్యాప్తు సంస్థ ఈ నెల13న లేఖ పంపింది. ఈ క్రమంలో ఇవాళ విచారణకు అంగీకరించగా ఈడీ అధికారులు ఆయన నివాసానికి వచ్చి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు తనకు సమన్లు జారీ చేయడం అక్రమం అని ఆరోపించారు. 
 
సమన్లకు హేమంత్‌ సోరెన్‌ స్పందించకపోవడంతో ఈడీ అధికారులు శనివారం ఆయన ఇంటికి వచ్చి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈడీ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నిరసనల దృష్ట్యా అధికారులు రాంచీలోని ముఖ్యమంత్రి ఇల్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జోనల్ కార్యాలయం చుట్టూ భద్రతను పెంచారు.