
ఉత్తరప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే చేయాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని హిందూ సంఘాలను సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
శ్రీకృష్ణ ఆలయ సమీపంలోని ఉన్న షాహీ ఈద్గా మసీదును తొలగించి, అక్కడ ఉన్న మొత్తం 13.7 ఎకరాల భూమిని శ్రీకృష్ణ ఆలయానికే అప్పగించాలని మథుర కోర్టును హిందూ సంఘాలు ఆశ్రయించగా, ఆ వివాదం అక్కడి నుంచి అలహాబాద్ హైకోర్టుకు, ఆ తర్వాత చివరికి సుప్రీంకోర్టుకు చేరింది. అయితే ఇటీవలె ఈ వివాదంపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు నియమించే కమిషనర్ ఆధ్వర్యంలో సర్వే చేపట్టనున్నారు. మథురలోని శ్రీకృష్ణ జన్మస్థలంలో 17 వ శతాబ్దంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారనేది హిందూ సంఘాలు చేస్తున్న వాదన. ఈ వ్యవహారంపై హిందూ సేనకు చెందిన విష్ణు గుప్త అనే వ్యక్తి మథుర కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షాహీ ఈద్గా మసీదు ఆవరణలో సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ పిటిషన్ విచారణకు తీసుకోవడం పట్ల ముస్లిం సంఘాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో ఈ వివాదం అలహాబాద్ హైకోర్టుకు ఎక్కింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ముస్లిం సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు అడ్డుకుంది. శ్రీకృష్ణ జన్మస్థలం ఉన్న ప్రాంతంలోని మొత్తం 13.37 ఎకరాల భూమిపై హిందువులకే హక్కు కల్పించాలని హిందూసేన డిమాండ్ చేస్తోంది.
మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు ఆదేశాలతో మథురలోని కాట్ర కేశవ దేవ్ ఆలయాన్ని కూల్చి, మసీదును నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి.
దానికి సాక్ష్యంగా మసీదు గోడలపై కొన్ని తామర పూలు, హిందూ పురాణాల్లో దేవతగా ఆరాధించే శేషనాగ్‌ను పోలి ఉన్న ఆకారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించారని చెప్పడానికి ఇవే సాక్ష్యాలని వాదిస్తున్నారు.
1947 ఆగస్టు 15 వ తేదీ నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలను అలాగే కొనసాగించాలనే 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం పిటిషన్‌ను తిరస్కరించాలని ముస్లిం పక్షాలు డిమాండ్ చేశాయి. అయితే శ్రీ కృష్ణ జన్మస్థానం గురించి హిందూ, ముస్లిం పక్షాల మధ్య 1968లో ఒక ఒప్పందం జరిగింది. సేవా సంస్థాన్, షాహీ ఈద్గా మసీదు ట్రస్టులు ఈ ఒప్పందంపై సంతకాలు కూడా చేశాయి. దాని ప్రకారం శ్రీకృష్ణ జన్మభూమికి 10.9 ఎకరాలు, మసీదుకు 2.6 ఎకరాలు కేటాయించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు